30-08-2025 12:35:22 AM
నిమ్స్ వైద్యులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచన
ఖైరతాబాద్, ఆగస్టు 29 (విజయ క్రాంతి) : అత్యవసర పరిస్థితుల్లో నిమ్స్‌కు వస్తున్న పేషెంట్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిమ్స్ వైద్యులకు సూచించారు. శుక్రవారం నిమ్స్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ బీరప్ప మాట్లాడతూ... నిమ్స్లో ఈ సంవత్సరం తొలి 7 నెల్లలో 5 లక్షల 44 వేల మందికి వైద్య సేవలు , వందకుపైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు కూడా చేశామని తెలిపారు.ఇందులో సగానికిపైగా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స పొందారని తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో, నిమ్స్‌కు వచ్చే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు.
ప్రస్తుతం నిమ్స్ ఎమర్జెన్సీకి రోజుకు 80 నుంచి వంద మంది పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. ఇందులో సగం మందికిపైగా పేషెంట్లు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్లో చికిత్స పొంది, పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో నిమ్స్‌కు వస్తున్నారని వెల్లడించారు.
ఎమర్జన్సీకి వచ్చే పేషెంట్లలో నేరుగా నిమ్స్కు వచ్చే వారికి, ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి రిఫర్స్‌పై వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, , మెడికల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ వాణి, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజారావు, డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.