27-10-2025 02:10:04 AM
ఢిల్లీ నుంచి గల్లీ దాక అన్నిస్థాయిల్లో పాతుకుపోయిన అగ్రకులాధిపత్య వాదాన్ని కూలదోసి ‘మేమెంతో.. మాకంత’ అనే బహుజనుల డిమాండ్‌ను భుజానికెత్తుకుని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఇటీవల ‘హిస్సా ఇజ్జత్ హుకుమత్’ అనే విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ టీ చిరంజీవులు రాసిన వ్యాసాల సంకలననాన్ని ముద్రించింది.
జస్టిస్ ఈశ్వరయ్య, సామాజిక తత్వవేత్త బీఎస్ రాములు, డాక్టర్ పూర్ణచంద్రరావు, ప్రొఫెసర్ మురళీమనోహర్ రాసిన ముందుమాటలు పుస్తకం ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. బహుజనులు ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరాన్ని విశదీకరిస్తాయి. డాక్టర్ చిరంజీవులు పరిపాలన రంగంలో సుదీర్ఘ కాలం కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు.
ఒక అత్యున్నత అధికారిగా జీవితంలో ఎన్నో అనుభవాలను చూసి ఉంటారు. బహుళ రంగాల్లో బహుజనులకు జరిగిన అన్యాయాలను కళ్లారా చూసి, వాటిని గణాంకాలతో సహా ఈ పుస్తకంలో వివరించారు. పుస్తకం హిస్సా (ప్రాతినిధ్యం/ వాటా), ఇజ్జత్ (ఆత్మగౌరవం), హుకుమత్ (రాజ్యాధికారం) అనే మూడు అధ్యాయాలుగా విభజించి ఉంటుంది. రచయిత పుస్తకం ద్వారా రాజకీయరంగం, న్యాయవ్యవస్థ, విద్య, ఉద్యోగ, ఉపాధి, బ్యాంకింగ్, ఫార్మా, పత్రిక, సినిమా పరిశ్రమ..
ఇలా సుమారు 26 రంగాల్లో బీసీల ప్రాతినిధ్య లేమిని వివరిస్తారు. ‘మన లెక్కలు మనకే తెలియకపోతే ఎదుటివారు మనల్ని లెక్కచేయరు’ అనే నినాదంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన జనాభా లెక్కల నాటి నుంచి 2011 జనాభా లెక్కల వరకు, కాకా కాలేల్కర్ కమిషన్ నుంచి మొన్నటి డెడికేటెడ్ కమిషన్ వరకు రచయిత సాధికారికంగా ప్రభుత్వాల నిర్ణయాలు, అస్తిత్వ, బహుజన ఉద్యమాల్లోని లోతుపాతులను వివరించారు. బీసీల సామాజిక న్యాయం, రాజ్యాధికారం, ఆత్మగౌరవాన్ని బలపరుస్తూ భావ ధార సాగుతుంది.
పాలకవర్గాలు విస్మరించిన వాస్తవాలు
భారతదేశానికి గంగా, యమున, సరస్వతి, కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదులెట్లనో, అడవులెట్లనో, ఖనిజ సంపదెట్లనో బీసీలు అట్ల. కూరాడు లేకుండా ఇల్లు ఉండదు. పాదులేకుండా పందిరి ఉండదు. నాగలి లేకుండా వ్యవసాయం ఉండదు. కొడవలి లేకుండా కల్లం ఉండదు. బీసీలు వేసిన పట్టాలు లేకుండా ఏ రైలు గమ్యానికి చేరుకోదు. బీసీలు నిర్మించని నాగరికత దేశ చరిత్రలో లేవు. ఒక దేశాన్ని చూడాలంటే ముందు బీసీల చరిత్రను చదవాలి.
బీసీల కోణం నుంచి చరిత్రను అర్థం చేసుకోవాలి. శతాబ్దాలుగా చేతివృత్తులు కొనసాగిస్తూ, పనిముట్లను ఆయుధాలుగా చేసుకుని, శ్రామిక స్వేదంతో మానవాళిని ఎలా ముందుకు నడిపిస్తున్నారనేది తెలుసుకోవాలి. మొత్తం 116 బీసీ కులాల్లో సుమారు 90 కులాలకు చెందిన వారు ఇప్పటివరకు అసెంబ్లీ గడప తొక్కలేదంటే వారి వెనుకబాటును ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు అసెంబ్లీ గడప తొక్కిన వారిలో అధిక జనాభా ఉన్న కులాల వారే వెళ్లారనడంలో ఏ సందేహమూ లేదు.
బీసీ ఏ కేటగిరీలో ఉన్న కులాలు ఇప్పటికీ కనీసం గ్రామస్థాయి పదవులను సైతం దక్కించుకోలేదంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయవచ్చు. ఇలాంటి పరిణామలన్నింటినీ డాక్టర్ చిరంజీవులు ఈ పుస్తకంలో వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ డొల్లతనాన్ని ఎండగట్టారు.
‘జనాభాలో సగం ఉన్నా అధికారంలో ఒక శాతం కూడా లేని బీసీలు. ఓటర్ లిస్టులో జాడలేని సంచార కులాలు వారి ఆర్థిక పరిస్థితులు చెప్పనలవి కావు. ఎంబీసీలు అర్థసంచార, సంచార కులాల వెనుకబాటుతనం ఇప్పటికీ దినదినం గండమే. ఈ పరిస్థితి అంతటా మారడానికి ఓటు అనేది కీలకం. ఓటు చైతన్యం ద్వారానే బీసీలు రాజ్యాధికారం సాధించగలరు’ అని డాక్టర్ చిరంజీవులు ఘంటాపథంగా చెప్తారు.
అధ్యయనశీలురకు అవసరం
తెలంగాణలో ప్రస్తుతం బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్నారు. బీసీల అస్తిత్వ, రాజకీయ ఉద్యమం ఇప్పుడు రాజకీయవాదంగా మారింది. అధికార పార్టీ కాంగ్రెస్ కోటాపై ఆనుపానులన్నీ తెలిసి రిజర్వేషన్ల నాటకాన్ని రక్తికట్టిస్తున్నది. న్యాయస్థానాలు స్థానిక సంస్థల కేసుని కొట్టివేస్తాయని తెలిసినా 42% రిజర్వేషన్ల బిల్లును ‘మేం సాధిస్తాం. బీసీ రిజర్వేషన్లకు మేం అంబాసిడర్లం’ అంటూ ప్రగల్భాలు పలుకుతున్నది.
అలాంటి అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బహుజన ఉద్యమం రాజుకుంటున్నది. ఆయా పోరాటాలకు మరింత బలమిచ్చేలా డాక్టర్ చిరంజీవులు రచన ఉంది. తమ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని , రాజ్యాధికారాన్ని సాధించాలనుకున్న ప్రతి బహుజనుడూ ఈ పుస్తకాన్ని చదవాలి. 1996లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకం కూడా నాడు ఇలాంటి సంచలనమే సృష్టించింది.
తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ‘సార్’ నాడు ఆ పుస్తకం ద్వారా చాటిచెప్పారు. అలాంటి ఉద్యమ స్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ చిరంజీవులు ఈ రచనకు పూనుకున్నారు. తాను స్వయంగా అనేక బీసీ ఉద్యమ వేదికలు, సదస్సులు, సభల్లో ప్రసంగించారు. ఆ వ్యాసాలన్నింటినీ గుదిగుచ్చి మన ముందుకు పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు.
బీసీ ఉద్యమం నిర్మాణాత్మకంగా ఉండాలంటే, ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలి. వాటిని అధ్యయనం చేసి ఎంతోమంది బహుజనులు విరివిగా ఉద్యమాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఒక్కటిగా ఉద్యమించి కోటా సాధించాల్సి ఉంది.