27-10-2025 02:08:16 AM
భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు గుండెకాయ ఎన్నికల తంతు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రజలే ప్రభువులుగా, ప్రత్యక్ష ఎన్నికలే ఆయువుపట్టుగా నిలిచిన మన వ్యవస్థలో, సగటు ఓటరు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి ప్రతి పౌరుడినీ పాలనలో భాగస్వామ్యం చేసింది రాజ్యాంగం. అయితే, ఈ వ్యవస్థలో ఎన్నో లోపాలు పొడసూపుతున్నాయి. అపసవ్య పోకడలు మితిమీరుతున్నాయి.
అలాంటి అప్రజాస్వామిక వైఖరులను నిశితంగా పరిశీలిస్తూ, వాస్తవాలను తన ‘ఏడుకోలల బాయి’ కవితల సంకలనం ద్వారా వివరించారు సాహితీవేత్త ఏనుగు నరసింహారెడ్డి ఒకవైపు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడిగా కొనసాగుతూనే, మరోవైపు తన సాహితీకృషినీ కొనసాగిస్తున్నారు.
ఈ కవితల సంకలనంలో ఆయన ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతల మోసపూర్తి వాగ్దానాలను, ఓట్ల కోసం వారు చేసే ఫీట్లను వ్యంగ్యపూరితంగా, విమర్శలుగా కవి తన కవితల్లో వివరించారు. వాకిట్లో ముగ్గు వేయడం, చిన్నపిల్లలను చంకనెత్తుకోవడం, పశువులకు మేత వేయడం, రోగిష్టుల వద్ద కన్నీరు కార్చడం వంటి ఉపమానాలు తీసుకుని రాజకీయ వ్యవస్థల్లోని కుళ్లును ఎండగట్టారు. ‘వెండితెర నటులను మించిన నటన మన రాజకీయ నాయకులది’ అంటూ విమర్శించారు.
ఆకిట్ల ముగ్గేయ అక్కయ్య నేనున్న/నని నజాకతు జేయు నష్కగొట్టు/ఒగలైన కన్నీళ్లు ఒలకబోయు’ అంటూ ఒక కవితలో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ బైకు, పెట్రోల్, టీవీ, డిష్, సెల్‌ఫోన్, వైl ఫై, ఏసీల వంటి ఉచిత హామీల వర్షం కురిపించే రాజకీయ నేతల గారడీ విద్యలంటూ పేర్కొంటారు.
అలా ప్రజలను మోసగించి ఓట్లు రాబట్టుకోవడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ‘ఇంటింటికీ బైకు నిత్తునన్ గెలిపించ/తోడుగా పెట్రోలు తోడిపోతు/ ఏసీలు లేనిండ్లు పీసీలు లేనిండ్లు ఉండనివ్వను నేను ఉర్విలోన’ అంటూ రాజకీయ నాయకుల మాటలు, చేతల మధ్య ఉండే అగాథాన్ని కళ్లకు కట్టారు.
ఓటర్లు ఎన్నికల సమయంలో బరిలో నిలబడే అభ్యర్థుల చరిత్రను పరిశీలించాలని, హామీల్లో సత్యాన్ని, అసత్యాన్ని విచారించాలని తన కవితల ద్వారా హెచ్చరించారు. ‘ఓటరా! పరికించి ఒకసారి చూడరా/ అభ్యర్థి అను వాడి లభ్యచరిత/ మాటకూ చేతకూ మాలావు దూరాలు/ పెట్టువాడిని కనిపెట్టి చూడు’ అంటూ ఉద్బోధ చేస్తారు.
నీతి లేని రాజకీయం- అవినీతికి నిర్వచనం, రాజకీయ నాయకుల నైజం, నాగుపాము కాటుతో పోలుస్తూ కవిత రాశారు. ‘కాటు వేయని నాగును కానగలమె/ దోచుకొనుటను మానిన దొరలు గలరె?’ అంటూ రాజకీయాల్లోని లోపాలను ఎండగట్టారు. ఎన్నికల దిశను మార్చేస్తున్న మద్యం, డబ్బులు, పట్టుచీరెలు, వెండి వస్తువుల పంపిణీ వంటి ప్రలోభాలపై కవి తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఇంటింటికో సీసా..
ఇంటికో పదివేలు/ ఇచ్చిరావలెనోయి నచ్చజెప్పి/ పడతులందరికినీ పట్టు చీరెల బాక్సు/ గుట్టుగా ఇవ్వాలి గుర్తు జూపి’ అంటూ రాజకీయ నాయకుల ఒత్తిడికి లోనవుతున్న ప్రభుత్వ అధికారుల బాధను, వారి నిస్సహాయతనూ కవితల్లో స్పృశించడం విశేషం. రాజకీయ నేతల మాయమాటల హామీల మర్మాన్ని ప్రజలు తెలుసుకోవాలని, ఆలోచించకుండా ఓటు వేయొద్దని ‘వెంకన్న’ పేరుతో సమాజాన్ని సంబోధిస్తూ వ్యంగ్యంగా రాసిన కవితలు ఓటర్లను ఆలోచింపజేస్తాయి.
నిబంధనల గురించి మాట్లాడి హింసకు గురయ్యే అధికారుల పరిస్థితిని వివరిస్తూ, కేవలం ‘సిట్టంటే కూర్చొని స్టాండంటె నిలుచునే/ అధికారులే మాకు అవసరమ్ము’ అని నాయకులు కోరుకుంటున్నారని కవి చెప్పడం వ్యవస్థలోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తుంది. బహుళ పార్టీల వ్యవస్థ వల్ల దేశంలో అవినీతి పెరిగిపోతుందని, స్థిరమైన, అవినీతి రహిత పాలన కోసం అభివృద్ధి చెందిన దేశాల్లా రెండు పార్టీల వ్యవస్థే మేలని చైనా ఉదాహరణతో కవి ఒక పరిష్కారాన్ని చూపడం ఆలోచించదగిన అంశం.
‘ఏడుకోలల బాయి - ఎన్నికల శతకం’ కేవలం కవితా సంకలనం మాత్రమే కాదు. ఇది భారత ఎన్నికల వ్యవస్థలోని లోపాలను వాస్తవికంగా వివరించే గొప్ప పుస్తకం. దీనిలోని కవితలు ఆలోచనపరులైన పాఠకులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. పారదర్శకమైన ఎన్నికల తంతు, రాజకీయ నాయకుల్లో నైతికతను ఆశిస్తూ కవి చేసిన ప్రయత్నం ప్రతిఫలించాలని కోరుకుందాం.