25-07-2024 12:05:00 AM
రంగారెడ్డి, జూలై 24 (విజయక్రాంతి): మోయినాబాద్ మండలంలోని చిలుకూరులో అన్యమతస్థుల కట్టడాలు చేపట్టవద్దని బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని వక్ఫ్‌బోర్డు భూమిలో ఓ వర్గానికి చెందిన పురాతన నిర్మాణం ఉండేది. ఆ భూమి పక్కనే ఉన్న స్థలాన్ని ఒక ఎన్‌ఆర్‌ఐ కొనుగోలు చేసి, చదును చేసే క్రమంలో పురాతన కట్టడాన్ని కూల్చివేశాడు. దీంతో గ్రామానికి ఓ వర్గం వారు వక్ఫ్‌బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు పురాతన కట్టడం ఉన్న స్థలంలోనే తిరిగి నిర్మించాలని ఆ వర్గం వారు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.
అయితే నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి చిలుకూరుకు వేలాది భక్తులు తరలివస్తుంటారని, ఆలయ సమీపంలో ఇతర మతానికి చెందిన కట్టడం చేపట్టవద్దంటూ గ్రామస్థులతో పాటు బజరంగ్‌దళ్ నేతలు బుధవారం ఆందోళన చేపట్టారు. భవిష్యత్తులో మతపరమైన గొడవలు తలెత్తే అవకాశాలు ఉంటాయని, అట్టి నిర్మాణం నిలిపివేయాలని కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు.
సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని, భవిష్యత్తులో సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అందరూ సమయన్వయం పాటించాలని, శాంతి, భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.