27-08-2025 02:20:18 AM
కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం
సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, ఆగస్ట్26(విజయక్రాంతి): పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ చేస్తున్న ఆరోపణలన్నీ తొండి ఆరోపణలే అని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.
42 శాతం రిజర్వేషన్ లో మైనారిటీలకు పది శాతం అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని,ఓట్ చోరీ జరుగుతుందంటే ఓటు వేసిన అందరినీ అవమానపరచినట్టని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దేవుళ్లపై వ్యాఖ్యలు చేయకున్నా చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ విధంగా సమాధానం చెప్పలేక తప్పుడు ప్రచారం చేయడం పక్క దారి పట్టించడం బండి సంజయ్ కుమార్ కు వెన్నతో పెట్టిన విద్య అని నరేందర్ రెడ్డి ఆరోపించారు.
ఒక బీసీ నాయకుడు 45 సంవత్సరాలుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీని బిచ్చగాళ్ల పార్టీ అని మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దిష్టి బొమ్మలు ఫ్లెక్సీలు కాలపెట్టడం మేము మొదలు పెడుతే మీరు తట్టుకోలేరని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికైనా బండి సంజయ్ కుమార్ 42 శాతం రిజర్వేషన్,ఓట్ చోరి ఈ రెండు అంశాలపై ప్రజలకు మీ వైఖరి స్పష్టం చేయాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో ఎండి తాజ్,జీడి రమేష్,పెద్దిగారి తిరుపతి,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,అస్థాపురం రమేష్,శభాన మహమ్మద్, ఊరడి లత,యనమల మంజుల,కిరణ్ రెడ్డి,మాసుం ఖాన్,తోట అంజయ్య,కొట్టే ప్రభాకర్, మామిడి సత్యనారాయణ రెడ్డి,ఇమ్రాన్, తదితరులుపాల్గొన్నారు.