27-11-2025 06:52:50 PM
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఫండ్స్ తెచ్చే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో మునిగి పోయిందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేకు ఫండ్స్ రాలేని పరిస్థితిని గ్రామాల ప్రజలు గమనించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి పూర్తిగా కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడి ఉందని, బండి సంజయ్ ప్రతినిధులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి ఖాయమని తెలిపారు.
బీజేపీ బలపర్చిన అభ్యర్థులను విజయం సాధింపజేయాలని పిలుపునిచ్చారు.రెండు సంవత్సరాల తరువాత స్థానిక సంస్థలకు మోక్షం లభించనుందని పేర్కొన్నారు.ఖజానాలో పైసలు లేవని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని ఎలా సాధిస్తుందో ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలను, రైతులను పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారని విమర్శించారు. సిరిసిల్ల ప్రజలు గెలిపించిన తరువాత ఆయన రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిపోయారని వ్యాఖ్యానించారు. తంగళ్లపల్లి మండలానికి ఇప్పటివరకు రూ. 1.75 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేశారు. మండలంలో 15 బోర్లను ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఏర్పాటు చేశారు.
కమ్యూనిటీ హాల్స్ కోసం సుమారు రూ. 30 లక్షల నిధులు మంజూరు చేశారు.సి ఎస్ ఆర్ నిధుల ద్వారా అంబులెన్స్‌లను కొనుగోలు చేసి ఆస్పత్రులకు అందజేశారు.సుమారు 20 వేల సైకిళ్లను విద్యార్థులకు అందించారు.పదో తరగతి విద్యార్థుల పరీక్ష రుసుములను చెల్లించేందుకు ముందుకు వచ్చారు.ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.పైసలు లేవని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ఎలా చేస్తుందో, ఫండ్స్ లేని స్థానిక ఎమ్మెల్యే పల్లెల అభివృద్ధి ఎలా సాధిస్తాడో ప్రజలు ఆలోచించాల్సిన అవసరాన్ని గోపి సూచించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాజిరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల మండల ఇంచార్జ్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా కోశాధికారి ఇంచార్జులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.