calender_icon.png 23 December, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లా రాజకీయ నేత సికిదార్‌పై కాల్పులు

23-12-2025 12:00:00 AM

  1. దుండగుల ఫైరింగ్.. తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
  2. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలింపు
  3. సికిదార్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన
  4. కాల్పుల ఘటనపై భగ్గుమన్న యువత.. పలుచోట్ల నిరసనలు

ఢాకా, డిసెంబర్ ౨౨: బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఖుల్నా పట్టణంలో సోమవారం ఉదయం నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత మహమ్మద్ మోతేలాబ్ సికిదార్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల్లో సికిదార్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. రక్తపు మడుగులో పడిఉన్న సికిదార్‌ను తోటి కార్యకర్తలు హుటాహుటిన సమీప ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రాడికల్ ఇస్లామిక్ నేత ఉస్మాన్ హాదీ మరణంతో నిన్నమొన్నటి వరకు బంగ్లాదేశ్ అట్టుడికిన సంగతి తెలిసిందే. మైమెన్సింగ్ జిల్లాలో ఆందోళనకారులు దీపూ అనే హిందువును హతమార్చి చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టిన విషయమూ విదితమే. రెండు ఘటనలతో నిన్నమొన్నటి వరకు ఆ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా మరో నేతపై కాల్పులు జరపడం కలకలం రేపింది. సికిదార్ ఎన్సీపీ పార్టీలో కీలక నేతగా పనిచేస్తున్నాడు.

ఆ పార్టీ శ్రామిక్ శక్తి విభాగంలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తోటి కార్యకర్తలతో కలిసి ‘మెట్రోపాలిటన్ యూనియన్’ ర్యాలీకి ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం సికిదార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. కాల్పుల ఘటనపై ఓ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ ‘మోతేలాబ్ సికిదార్‌పై గుర్తు తెలియని వ్యక్తులుకాల్పులు జరిపారు.

రెండు బుల్లెట్లు ఆయన చెవిని చీల్చుకుంటూ వెళ్లాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎలాంటి ప్రమాదం లేదు’ అని స్పష్టం చేశారు. మరోవైపు సికిదార్‌పై కాల్పుల ఘటనపై ఆయన మద్దతుదారులు తీవ్రంగా స్పందించారు. రాజధాని ఢాకాలో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. 

వరుసగా కాల్పుల ఘటనలు..

బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో రాజకీయ, విద్యార్థి సంఘాలపై నాయకులపై కాల్పులు చోటుచేసుకోవడం అక్కడి పౌరుల్లో అశాంతిని రగిలిస్తున్నాయి. అభద్రతను కల్పిస్తున్నాయి. బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమవుతోందని అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా విద్యార్థి ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ నేతలే లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడులు చేయడంపై అక్కడి యువత భగ్గుమంటున్నది. దాడుల వెనుక పాత ప్రభుత్వ మద్దతుదారులు ఎవరైనా ఉన్నారా లేదా ఇతర శక్తులు ఉన్నాయా.. అన్న కోణంలో అక్కడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బంగ్లా హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. దేశ సరిహద్దుల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది.

దీపూ హత్యకు సహోద్యోగులే కారణం

బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ జిల్లాలో దీపూ చంద్రదాస్(౨౭)అనే హిందువు హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. దీపూను తన సహోద్యోగులే అల్లరి మూకలకు అప్పగించారని అక్కడి పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. దీపూ దైవదూషణ చేశాడనే నిరాధారమైన ఆరోపణలు మోపి మూక దాడి చేశారని, అతడిని హింసించి.. హతమార్చి, అనంతరం చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టారని గుర్తించారు.

తనను వదిలేయాలని వేడుకున్నా హంతకులు కనికరం చూపలేదని, దీపూతోపాటు హంతకులు ఒకే పరిశ్రమలో పనిచేసేవారని, విద్యార్థి నేత హదీ మరణవార్త వెలువడిన తర్వాతే దీపూ హత్య జరిగిందని నిర్ధారించారు. హత్యకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు ఇప్పటికే సేకరించారు. హత్యపై పరిశ్రమ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు పరిశ్రమ అధికారులు, సహోద్యోగులు సహా 12 మందిని అరెస్టు చేశారు.