calender_icon.png 12 September, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతివృత్తిదారులకు బ్యాంకులు లోన్లు ఇవ్వాలి

12-09-2025 01:08:36 AM

-క్రెడినోవా ఫిన్ టెక్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): పేద ప్రజలకు, చిన్న వ్యాపారులతో పాటు వృత్తిదారులకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఈ విషయంలో సామాన్యులు, వృత్తిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.

విద్యా, వ్యవసాయ రుణాలతో పాటు చేతి వృత్తుల వారికి, చిన్న వ్యాపారస్తులకు, మహిళలకు ఎక్కువ రుణాలు ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. గురువారం అమీర్‌పేట లో ఔత్సాహిక వ్యాపారవేత్తలు పిట్టల కిరణ్, బొమ్మ శరత్ గౌడ్ స్థాపించిన క్రెడినోవా ఫిన్ టెక్ సంస్థ కార్యాలయాన్ని ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాల వల్ల దేశంలో బ్యాంకింగ్ సేవలు విస్తృతమయ్యాయని చెప్పారు. చేతి వృత్తుల వారికి, స్వయం ఉపాధి చేసుకునేవారికి, చిన్న వ్యాపారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా మహిళలు వ్యాపారాలు చేసుకోడానికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలని తెలిపారు.

ప్రజలకు రు ణాల పంపిణీపై శిక్షణ ఇచ్చి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని క్రెడినోవా ఫిన్ టెక్ సంస్థ లక్ష్యంగా పెట్టుకోవడం సంతోషకరమని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కొత్తగా వ్యాపారాలు చేసుకునే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రుణాలు మంజూరు చేయించేందుకు క్రెడినోవా సంస్థ పని చేయాలని సూచించారు. యువతకు ఆర్థిక సాధికారత కల్పించడానికి తోడ్పాలని తెలిపారు.