27-09-2025 11:25:29 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రకృతిని పూజించే సంస్కృతికి నిదర్శనం, తెలంగాణలో ఆడపడుచుల పండగ బతుకమ్మ వేడుక అని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో ఏర్పాటుచేసిన బతుకమ్మ సంబరాలలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిలో లభించే పూలను సేకరించి బతుకమ్మగా పేర్చి ప్రకృతిని దేవతగా కొలిచే తెలంగాణ మహిళల సాంస్కృతిక పండుగ వేడుక అన్నారు.
తెలంగాణలో ఆడపడుచులకు ఎంతో గౌరవం ఉంటుందని, మహిళలందరూ కలిసి సంతోషంగా జరుపుకునే బతుకమ్మ సంబరాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి దిశగా అనేక చేయుట పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులు, కలెక్టరేట్ లోని మహిళా ఉద్యోగులు, మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొని నృత్యం చేసి అందరిలో ఉత్సాహం నింపారు.