calender_icon.png 22 September, 2025 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ వైభవంగా నిర్వహించాలి

22-09-2025 05:16:08 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ సాంస్కృతి పండుగ వాతావరణం వెళ్లి విరిసేలా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగ నిర్వహించాలని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ లైట్లతో ముస్తాబు చేయాలని, జిల్లాలో బతుకమ్మ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీలు, గ్రామాలలో బతుకమ్మ ఆడే ప్రాంతాలు, బతుకమ్మను నిమజ్జనం చేసే చెరువులు ఇతర నీటి వనరుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, మైకులను ఏర్పాటు చేయాలని, పరిసరాలను శుభ్రపరచాలని, నిమజ్జనం ప్రాంతంలో గజ ఈతగాలను అందుబాటులో ఉంచాలని అన్నారు.

అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారం మేళాలను నిర్వహించాలని, కలెక్టరేట్ లో సద్దుల బతుకమ్మ వరకు ప్రతీ రోజు ఒక డిపార్ట్మెంట్ బతుకమ్మ పండుగను నిర్వహించాలని, 30వ తారీకు సద్దుల బతుకమ్మ రోజు కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగులచే పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ నిర్వహించాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలకు జిల్లా నోడల్ అధికారిగా డిఆర్డిఓ అన్ని పనులు సక్రమంగా జరిగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని డిఆర్డిఓ సురేందర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.