18-10-2025 03:39:59 PM
బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఐక్యంగా పాల్గొని బంద్ విజయవంతం
కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రం లో బీసీ వర్గాల హక్కుల సాధన కోసం బీసీ బంద్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎన్నిల అనిల్, మోహిఉద్దీన్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున ఏషాల దత్తాత్రి, బోయిడి అభిషేక్, కందుర్ కనకయ్య నేతృత్వంలో కార్యకర్తలు భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి, బీసీ వర్గాలకు న్యాయం చేయాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కి మద్దతు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాల సంక్షేమం కోసం రాజకీయ భేదాలు పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. బీసీ బంద్ కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.