31-07-2025 01:35:57 AM
యాదవ హక్కుల పోరాట సమితి
ముషీరాబాద్, జూలై 30(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పంపిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి పార్లమెంటు సమావేశాల్లో ఆమోదించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు కుంట రవీందర్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చ రించారు.
ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమితి జాతీయ ఉపాధ్యక్షులు ఎర్రం స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శి నక్క రాములు యాదవ్, జాతీయ అధికార ప్రతినిధి కుమారస్వామి యాదవ్ లతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంద న్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో బీసీలను అణగదొక్కారని, ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బీసీల మీద కపట ప్రేమ చూపిస్తుందన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు బీసీలపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. తెలంగాణలో బీసీల అణిచివేతనే ప్రధానంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. 0.1 శాతం జనాభా ఉన్న అగ్రకుల వ్యక్తిని బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి ఇచ్చి బీసీలను అవమానించారని ఆరోపించారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం జంతర్ మంతర్ దగ్గర చేపట్టబోయే ధర్నాలో బీసీ లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గతంలో సిఫార్సు చేసిన మండల్ కమిషన్ వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. సమితి సభ్యులు తెనుగు రాజు ముదిరాజ్, విలాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.