31-07-2025 01:35:13 AM
-డీడీ చెల్లించిన తర్వాత దరఖాస్తుల తిరస్కరణ
-నాగోల్ రాజీవ్ స్వగృహ ఇండ్ల సముదాయం వద్ద దరఖాస్తుదారుల ఆందోళన
ఎల్బీనగర్, జులై 30 : రాజీవ్ స్వగృహ ప్లాట్ల కేటాయింపుల్లో గందరగోళం నెలకొన్నది. డీడీలు తీసుకుని ప్లాట్ల కేటాయింపుల్లో కొందరి దరఖాస్తులను తిరస్కరించడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. డీడీ తీసుకుని తమ దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారని అధికారులను ప్రశ్నించారు. రాజీవ్ స్వగృహ ఇండ్ల కేటాయింపులపై నాగోల్ లో ప్లాట్ల కేటాయింపుల కోసం లబ్ధిదారుల ఎంపికపై బుధవారం లక్కీ డ్రా తీశారు. డ్రా తీసే సమయంలో దరఖాస్తుదారుల పేర్లను అధికారులు ప్రదర్శించారు.
అయితే, లక్ష రూపాయల డీడీ, ఇతర ధృవీకరణ పత్రాలు ఇచ్చిన తర్వాత కొందరి దరఖాస్తుదారుల పేర్లను తొలిగించారు. ఎంతో ఆశతో వచ్చిన దరఖాస్తుదారుల ఆశలు నీరుగార్చే విధంగా అధికారులు వ్యవహరించారు. డీడీలు ఇచ్చిన సమయంలో అన్ని పత్రాలను పరిశీలించి, దరఖాస్తులను ముందుగానే తిరస్కరిస్తే తాము ఇక్కడికి వచ్చేవాళ్లం కాదుగా అని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు దరఖాస్తుదారులు మాట్లాడుతూ... నాగోల్ రాజీవ్ స్వగృహ ఇండ్ల సముదాయంలో డబల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్నారు.
వేలం పాటకు ముందుగానే డీడీలు ఇచ్చినవారి అప్లికేషన్స్ కాకుండా కొందరు నాయ కులు అందజేసిన అప్లికేషన్స్ పరిగణనలోకి తీసుకున్నట్లు ఆరోపించారు. డ్రా బాక్స్ లో ముందుగానే ఎంపిక చేసుకున్న వాళ్ల పేర్లు రాశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని దరఖాస్తుదారులు ఆందోళన చేపట్టారు. దీనిపై అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ప్లాట్ల కేటాయింపులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది.