27-10-2025 12:29:55 AM
-స్థానిక ఎన్నికలే లక్ష్యం
-42% రిజర్వేషన్ల
-ఉద్యమానికి అనూహ్య మద్దతు.
-కాంగ్రెస్ సహా అఖిలపక్షాల అండ.
-కాంగ్రెస్ ఫైవ్ మెన్ కమిటీ
-ఎమ్మెల్సీ బల్మూర్ ప్రకటన
-ఎస్సీ, ఎస్టీ, జర్నలిస్టు, ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతు.
-నిజామాబాద్ లో మారుతున్న సమీకరణలు జనరల్ స్థానాల్లోనూ పోటీకి వ్యూహంజ
నిజామాబాద్, అక్టోబర్ 26(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. “బీసీ రాగమే ఆయుధం”గా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను శాసించేందుకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) సిద్ధమైంది. కేవలం రిజర్వేషన్లకే పరిమితం కాకుండా, జనరల్ స్థానాల్లో సైతం పోటీకి దిగాలని నిర్ణయించడం రాజకీయ పార్టీలకు సరికొత్త సవాల్ విసురుతోంది.
పోతంకర్ లక్ష్మీనారాయణ చైర్మన్‌గా, బొబ్బిలి నర్స య్య వైస్ ఛైర్మన్‌గా ఏర్పడిన ఈ నూతన కమిటీ, అనతికాలంలోనే క్షేత్రస్థాయిలో బలం పుంజుకోవడం, అఖిలపక్షాల నుంచి మద్దతు కూడగట్టడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 18న నిర్వహించిన తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా తమ సంఘటిత శక్తిని చాటిన జేఏసీ, ఇప్పుడు పూర్తి దృష్టిని సర్పం, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పోరేటర్ ఎన్నికలపై కేంద్రీకరించింది.
జేఏసీ నిర్మాణంతోనే ఉదృతం..
నిజామాబాద్ జిల్లాలో బీసీ జేఏసీ దూకుడు పెంచింది. పోతంకర్ లక్ష్మీనారాయణ (చైర్మన్), బొబ్బిలి నర్సయ్య (వైస్ చైర్మన్) సహా కెంపుల నాగరాజు, రేవంత్, అంబదాస్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎండల ప్రదీప్, అదే ప్రవీణ్, ఇందలవాయి కిషన్ కో-చైర్మన్లుగా పటిష్టమైన కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన తెలంగాణ బంద్ విజయవంతం కావడం ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది.
గ్రామ స్థాయికి పాకుతున్న ఉద్యమం..
జేఏసీ కేవలం జిల్లా స్థాయికే పరిమితం కాలేదు. బోధన్, ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ వంటి కీలక డివిజన్లలో కమిటీలను వేగంగా ఏర్పాటు చేశారు. ఆసక్తికరంగా, అనేక మం డలాల్లో వివిధ బీసీ కులాల ప్రతినిధులు స్వచ్ఛందంగా జేఏసీ మండల కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పరిణామం 42% బీసీ రిజర్వేషన్ల డిమాండ్‌ను గ్రామ స్థాయికి బలంగా తీసుకెళ్లింది. ఇప్పుడు గ్రామాల్లో సైతం బీసీ జేఏసీ కమిటీలు కొలువుదీరుతుండటం క్షేత్రస్థాయిలో ఉద్యమం ఎంత బలంగా పాకుతుందో సూచిస్తోంది.
జిల్లాలో సంపూర్ణ మద్దతు..
బీసీ జేఏసీ ఉద్యమానికి కేవలం బీసీ సంఘాల నుంచే కాకుండా సమాజంలోని అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సాను కూలంగా ఉన్నాయని జేఏసీ వర్గాలు చెబుతుండగా, అఖిలపక్ష పార్టీలు సైతం మద్దతు పలుకుతున్నాయి. ముఖ్యంగా, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగ సంఘాలు ఈ ఉద్యమానికి బాసటగా నిలవడం గమనారం. ఎమ్మార్పీఎస్, మాల మహానాడు వంటి దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాలు సైతం సంపూర్ణ మద్దతు ప్రకటించడం బీసీ జేఏసీకి నైతిక బలాన్నిచ్చింది.
ఎమ్మెల్సీ బల్మూర్ హామీ..
నిజామాబాద్ జిల్లాలో జరిగిన తెలంగాణ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చురుగ్గా పాల్గొన్నారు. ఉదయం 5గంటలకే నిజామాబాద్ ఒకటో బస్ డిపో చేరుకొని, అక్కడ బైఠాయించిన బీసీ జేఏసీ నేతలతో కలిసి, బస్సులు నడవకుండా అడ్డుకున్నారు. రాష్ర్ట ప్రభుత్వం బీసీలకు అండగా ఉందని మాట్లాడారు. అనంతరం ధర్నా చౌక్ లో బీసీ జేఏసీ నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని, బీసీ బిల్లు ఆమోదానికి ఢిల్లీ స్థాయి ఉద్యమానికి సిద్ధమని ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తారని చెప్పి, బీసీ ఉద్యమానికి ఊపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు నేతలతో ఒక ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నిజామాబాద్ పార్లమెంట్ ఇంచార్జి హోదాలో పార్టీ తరపున కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ప్రకటించారు. ఈ కమిటీ, బీసీ జేఏసీ నిజామాబాద్ కమిటీతో కలిసి పని చేస్తుందని ఆదేశించారు. ముఖ్యంగా, జేఏసీ పిలుపు మేరకు వీరంతా “పార్టీ కండువాలు లేకుండా” బీసీ ఉద్యమం కోసం పని చేస్తారని హామీ ఇచ్చారు. ఈ హామీ పట్ల బీసీ జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక సమరంపై ప్రభావం..
రాబోయే సర్పం, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, కార్పోరేటర్ ఎన్నికల్లో కొన్ని పరిణామాలు పెను ప్రభావం చూపడం ఖాయం. అవేంటంటే...
ఎజెండాను నిర్దేశిస్తున్న జేఏసీ..
ఇప్పటివరకు రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసి, బీసీ సంఘాల మద్దతు కోరేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీసీ జేఏసీ 42% రిజర్వేషన్ల ఎజెండాను నిర్దేశిస్తోంది. ఏ పార్టీ అయినా, ఈ డిమాండ్‌కు అనుకూలంగా స్పందించని పక్షంలో, బీసీ ఓటర్ల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది.
జనరల్ స్థానాల్లో పోటీ.. అసలు సవాల్:
కేవలం రిజర్వ్డ్ స్థానాలకే పరిమితం కాకుండా, “జనరల్ స్థానాల్లో సైతం పోటీ చేయాలని” బీసీ జేఏసీ, బీసీ సంఘాలు నిర్ణయించడం అతిపెద్ద మలుపు. ఇది రాజకీయ పార్టీల ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉంది. బలమైన సామాజిక వర్గంగా ఉన్న బీసీలు, జేఏసీ మద్దతుతో జనరల్ స్థానంలో గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.
గ్రామస్థాయి నెట్‌వర్క్..
ఉద్యమం గ్రామ స్థాయి కమిటీల వరకు విస్తరించడం జేఏసీకి అతిపెద్ద బలం. స్థానిక ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించేది గ్రామ స్థాయి సమీకరణాలే. పార్టీలకు అతీతంగా “బీసీ” అభ్యర్థిని గెలిపించు కోవాలనే ఏకాభిప్రాయం గ్రామాల్లో వస్తే, అది రాజకీయ పార్టీల అంచనాలను తలకిందులు చేస్తుంది.
బలమైన సామాజిక కూటమి..
ఈ ఉద్యమానికి కేవలం బీసీలే కాకుండా ఎమ్మార్పీఎస్, మాల మహానాడు (ఎస్సీ), ఎస్టీ సంఘాలు మద్దతు పలకడం ఒక బలమైన సామాజిక కూటమికి సంకేతం. ఎన్నికల్లో ఈ కూటమి కలిసికట్టుగా పనిచేస్తే, అనేక మండలాల్లో, మున్సిపాలిటీలలో ఫలితాలను ఏకపక్షంగా మార్చే శక్తి వీరికి ఉంది.
కాంగ్రెస్ ముందు రెండు దారులు..
అధికార కాంగ్రెస్ పార్టీ 5-మెన్ కమిటీని వేసి జేఏసీతో కలిసి పనిచేస్తామని ప్రకటించడం ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. దీనివల్ల రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, జేఏసీ డిమాండ్లకు తలొగ్గి, సీట్ల సర్దుబాటులో వారికి పెద్ద పీట వేయడం ద్వారా ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకో వడం. రెండు, జేఏసీ గనుక కాంగ్రెస్ హామీలను నమ్మకుండా స్వతంత్రంగా బరిలోకి దిగితే, అది అధికార పార్టీకే ఎక్కువ నష్టం కలిగించే ప్రమాదం ఉంది.
చివరగా చూస్తే..
మొత్తం మీద, నిజామాబాద్ జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల గుర్తు కంటే “బీసీ” నినాదం చుట్టూనే తిరిగేలా జేఏసీ వ్యూహరచన చేస్తోంది. జర్నలిస్టులు, ఉద్యోగ సంఘాల మద్దతుతో ఈ అంశాన్ని మేధోపరంగా, ఎస్సీ, ఎస్టీ సంఘాల మద్దతుతో క్షేత్రస్థాయిలో బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ఏకీకరణ ఇలాగే కొనసాగితే, రాబోయే స్థానిక పోరులో బీసీ జేఏసీ బలపరిచిన అభ్యర్థులు నిర్ణయాత్మక శక్తిగా మారడం ఖాయం.
వ్యూహాత్మకంగా కాంగ్రెస్..
బీసీ జేఏసీ బలాన్ని, అక్టోబర్ 18 బంద్ ప్రభావాన్ని గమనించిన అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా స్పందించింది. బంద్‌లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హందాన్, నూడా చైర్మన్ కేశ వేణు, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాం భూపాల్, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ఉన్నారని వారు స్పష్టం చేశారు.