calender_icon.png 31 January, 2026 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీ.. త్రిముఖ పోటీ!

31-01-2026 12:00:00 AM

చౌటుప్పల్ పోరులో పార్టీల జోరు

ఒంటరిగా బరిలోకి కాంగ్రెస్    

బీఆర్‌ఎస్, బీజేపీలు పొత్తులకు చర్చలు?               

పీఠం దక్కించుకునేందుకు వ్యూహరచనలో పార్టీలు

చౌటుప్పల్, జనవరి 30: చౌటుప్పల్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా, అధికార పార్టీకి అడ్డుకట్ట వేసేందుకు బీఆర్‌ఎస్, బిజెపిలు తగిన పథక రచనలు చేస్తున్నాయి. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి రెండు పార్టీలు జతకట్టేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. మున్సి పాలిటీ పరిధిలోని 20 వార్డులలో మొత్తం ఓటర్లు 27,216 మంది ఉండగా అందులో పురుషులు 13,553, స్త్రీలు 13,663. ప్రధానంగా ఇక్కడ మూడు పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారు.

దీంతో పోటీ మూడు ముక్కలాటలా మారిపోయింది. ఏమి చేసైనా మున్సిపాలిటీ పీఠమును దక్కించుకునేందుకు మూడు పార్టీల నాయకులు ప్రణాళి కలు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈసారి చౌటుప్పల్ మున్సిపాలిటీలో భారీ మొత్తం లో నగదు పంపిణీ జరుగుతుందని ప్రచా రం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికలు అభ్యర్థుల గుణగణాలతో సంబంధం లేకుండా డబ్బుతో ముడిపడిన ఎన్నికలుగా మారిపోయే అవకాశాలు ఉన్న ట్లు విశేషకులు అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తుంది.                          

గతంలో ఇదీ పరిస్థితి 

గత మున్సిపల్ ఎన్నికల సమయంలోనే మొదటి సారిగా చౌటుప్పల్ ను మున్సిపాలిటీ చేశారు. అయితే మొదటిసారే ఇక్కడ చైర్మన్ ఎన్నిక రసవత్తంగా సాగింది. ఏ పార్టీకి సరైన మెజార్టీ రాకపోవడంతో నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఇతర పార్టీల నాయకులతో జతకట్టడంతోపాటు ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కును ఉపయో గించుకుని చైర్మన్ పీఠమును కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాడు, నేడు బలంగా ఉండడం గమనార్హం.      

కుర్చీపై కూర్చునేందుకు కాంగ్రెస్ కుతూహలం! 

స్థానికంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో పాటుగా అధికారంలో సైతం అదే పార్టీ ఉండటం ఈసారి ఒకెంత ఆ పార్టీకి కలిసిచ్చే అంశంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఈసారి ఎలాగైనా చైర్మన్ పీఠం మాకే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైన్ షాపులను మధ్యాహ్నం ఒంటిగంటి తర్వాత తీయించి సిట్టింగులకు సాయంత్రం 6 గంటల తరవాతే అవకాశం కల్పించాలని చెప్పడంతో మహిళలు ఆయనకే అండగా నిలుస్తారని వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అలాగే ఆయనకు ఉన్న వ్యక్తిగత అభిమానులు సైతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని వెరసి ఇవన్నీ కాంగ్రెస్ కి కలిసి వచ్చే అవకాశాలంటూ ఆ పార్టీ నాయకులు తమ సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు తెలుస్తుంది.                        

సీపీఎంతో జతకట్టిన బీఆర్‌ఎస్

ఎన్నికల వ్యూహాలలో భాగంగా బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి సిపిఎంతో జతకట్టి వార్డులని కైవసం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. స్థానికంగా బీఆర్‌ఎస్ కొంత బలంగా ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా మట్టి కరిపించాలని ఆలోచనతో ముందస్తుగా సిపిఎం తో పొత్తుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.                     

ఎత్తులు వేస్తున్న బీజేపీ  

చౌటుప్పల్ లో బీజేపీ కొంత మేర ఉండడంతో పాటు ఆ పార్టీకి చెందిన నాయకు లకు జనాలలో మంచి అభిప్రాయాలు ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బిజెపి నాయకులు ఈసారైనా తమకు కలిసి వస్తుందన్న ఆశాభావంతో పోటీ రంగంలోకి దూకెందుకు సిద్ధమైపోయారు. ఇదిలా ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొనాలంటే తమ బలానికి తోడు ఇతర పార్టీలను కూడా జత కొట్టుకోవాలని ఆలోచనతో ముందు జాగ్రత్తగా ఇతర పార్టీ నాయకులతో జత కట్టేందుకు చర్చలు జరుపుతు న్నట్లు తెలుస్తుంది.                        

ఆ రెండు పార్టీల పొత్తు కుదిరీనా? 

ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని మునిసిపల్ ఎన్నికల్లో ఓడించాలని లక్ష్యంతో బిజెపి, మరో బలమైన పార్టీ బిఆర్‌ఎస్ తో జట్టు కట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే కాంగ్రెస్ పార్టీకి బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంది.                  

వ్యూహరచనలో పార్టీలు

చౌటుప్పల్ మున్సిపాలిటీలో చైర్మన్ పీఠాన్ని అధిరోహించాలని మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారే వారు వ్యూహరచనలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓటును తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తుంది. అలాగే బీఆర్‌ఎస్, బిజెపిలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో లోపాలను, కుంటి సాకులతో రైతు బంధు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితులను, మునుగోడు నియోజకవర్గంలో లిక్కర్ స్టేట్ పాలసీకి వ్యతిరేకంగా ప్రత్యేక పాలసీని అమలు చేయాలని చూస్తున్న విషయాలను అన్నిటిని జనాల దృష్టికి తీసుకొని వెళ్లి అధికార పార్టీకి చైర్మన్ పీఠం దక్కకుండా చేయాలని చూస్తున్నాయి. దీంతో ఏ పార్టీలు ఎవరితో జట్టు కడతాయి ప్రభువులో ఎవరు విజయం సాధిస్తారు అనేది తేలాలంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడక తప్పదు.