21-01-2026 01:05:28 AM
ఏ ప్లస్ గ్రేడ్ తొలగింపు ?
ముంబై, జనవరి 20: భారత క్రికెట్‌లో ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ బీసీసీఐకి సెంట్రల్ కాంట్రాక్టుల విషయంలో సంచలన ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ ప్లస్ కేటగిరీని పూర్తిగా తొలగించాలనే ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ ఆమోదం లభిస్తే ఇకపై భారత క్రికెట్‌లో కేవలం ఏ, బీ, సీ అనే మూడు కేటగిరీలే ఉంటాయి. ప్రస్తుతం ఏ+ గ్రేడ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ , జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు.
అయితే ఈ నలుగురిలో అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్న ఏకైక ఆటగాడు ఒక్క బుమ్రానే. జడేజా ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ ప్లస్ కేటగిరీ కొనసాగించాల్సిన అవసరం లేదని సెలెక్షన్ కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి 7 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ గ్రేడ్ తొలగిస్తే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు తక్కువ కేటగిరీకి దిగజారే అవకాశాలు ఉన్నాయి.
అప్పుడు వారి వార్షిక కాంట్రాక్ట్ విలువ కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఏ కేటగిరీలో రూ.5 కోట్లు, బీ కేటగిరీలో రూ.3 కోట్లు, సీ కేటగిరీలో రూ.1 కోటి మాత్రమే చెల్లిస్తారు. వచ్చే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కొన్ని కీలక మార్పులు కూడా చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ తన కాంట్రాక్టును కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు అర్షదీప్ సింగ్‌కు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.