calender_icon.png 17 August, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండాలి

13-08-2025 12:15:50 AM

వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం

నిర్మల్, ఆగస్టు ౧౨ (విజయక్రాంతి): రాబోయే మూడు 3రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించినట్లు అధికారులు అప్రమత్తంగా ఉండండి కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.  మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ రామకృష్ణారావు, పలువురు మంత్రులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం, ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

అధిక వర్షాల వల్ల హఠాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున పశుకాపరులకు జాగ్రత్తలు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసినట్లు తెలిపారు ప్రమాదకర వంతెనల వద్ద వరదల సమయంలో ప్రజలు దాటకుండా పోలీసులు కాపలా ఉండాలని సీఎం ఆదేశిం చారు. రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్న వెంటనే మరమ్మతులు చేపట్టాలని, విద్యుత్ సరఫరా అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలని సూచించారు.

వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎస్డిఆర్‌ఎఫ్, ఎన్డిఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులతో మాట్లాడుతూ, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రాజెక్టుల గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో నిరంతరం అందుబాటులో ఉండి, సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తప్పక పాటించాలని, కాజ్వేలపై ప్రయాణం నిషేధించాలని, చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోతే వెంటనే స్పందించాలని, శిథిల భవనాల్లో నివసించే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. నదులు, వాగుల వద్దకు ఎవరూ వెళ్లకుండా చూడాలని, నీటి కలుషితం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా వైద్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి శాఖ అధికారులు తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి ప్రజలకు టామ్టామ్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు.

కలెక్టరేట్లో 24/7 గంటలు కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, అత్యవసర పరిస్థితుల్లో 91005 77132 నంబర్కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నాకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.