calender_icon.png 14 August, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండండి

13-08-2025 04:42:47 PM

దీర్ఘకాలిక డ్రైనేజ్ పరిష్కారాలు అవసరం: బీజేపీ కార్పొరేటర్ సరళ..

సనత్‌నగర్ (విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ అమీర్‌పేట్ డివిజన్ కార్పొరేటర్ సరళ(Ameerpet Division Corporator Sarala) బుధవారం విజ్ఞప్తి చేశారు. మూడు, నాలుగు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్లలోనే ఉండాలని ఆమె సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, తీగలు తెగిపడటం, వరదనీరు నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు హెల్ప్ లైన్ నెం. 21111111, 040-23225397 కు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్లపై నీటితో నిండిన గుంటలు, జారిపడే ప్రమాదం ఉన్నందున వాహనదారులు డ్రైవింగ్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, శానిటేషన్ తదితర శాఖల అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

అంతేకాక, వర్షపు నీటి ప్రవాహ సమస్యను దీర్ఘకాలిక దృష్టితో పరిష్కరించాల్సిన అవసరం ఉందని సరళ  పేర్కొన్నారు. కేవలం చెత్త తొలగించడం, పక్కకు విసరడం, శుభ్రపరిచే తాత్కాలిక చర్యలు సరిపోవని, సాంకేతికంగా సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను సమగ్రంగా పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. వర్షపు నీటి కాలువలు, మలినజల కాలువలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం రెండూ కలిసిపోవడం వల్ల ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. GHMC టోల్‌ఫ్రీ నెంబర్‌కు వచ్చే పిర్యాదులను సంబంధిత అధికారులకు వెంటనే చేరవేసి పరిష్కరించాలని సరళ కోరారు. అలాగే, ఓపెన్ నాలాలు పొంగి సమీప కాలనీలు, ఇండ్లలోకి వరదనీరు చేరకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రధాన రోడ్లతో పాటు బస్తీలు, కాలనీల్లో వర్షపు నీరు నిల్వకుండా సాఫీగా నీటి ప్రవాహం జరిగేలా చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ సరళ ఆదేశించారు.