14-08-2025 12:26:26 AM
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, నారింజ వాగు పరిశీలన
జహీరాబాద్, ఆగస్టు 13 : జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లు తున్నాయని ఈ వరదల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అన్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి కలెక్టర్ బుధవారం జహీరాబాద్ నుండి బూచినెల్లి గ్రామం వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. నారింజ వాగు నుండి వచ్చే వరదను ఎస్పీతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు, నారింజవాగు పరివాహక ప్రాంతం వివరాలను తెలిపే మ్యాపు ద్వారా కలెక్టర్కు వరద ఉధృతిని వివరించారు. భారీ వర్షాల కారణంగా జహీరాబాద్, న్యాల్కల్ తదితర ప్రాంతాల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాలలో స్థానిక పరిస్థితులను కలెక్టర్, ఎస్పీలు సమీక్షించారు. భారీ వర్షాలు ఈదురుగాలును వరద ప్రవాహాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.
నారింజ వాగు దగ్గరికి ఎవరు రాకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశించారు.భారీ వర్షాల దృష్ట్యా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట జహీరాబాద్ ఆర్డీఓ రాంరెడ్డి, తహసీల్దార్ దశరథ్, నీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు ఉన్నారు.