14-08-2025 01:22:40 AM
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈ మేరకు 32 జిల్లాలకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ప్రభుత్వ సలహాదారులకు జెండావిష్కరణ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అదిలాబాద్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, భద్రాద్రి కొత్తగూడెం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హన్మకొండ మంత్రి కొండా సురేఖ, జగిత్యాల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జయశంకర్ భూపాలపల్లి గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జనగాం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జోగులాంబ గద్వాల ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, కామారెడ్డి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి , కరీంనగర్ మంత్రి శ్రీధర్‌బాబు, ఖమ్మం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసిఫాబాద్ మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మహబూబాబాద్ ప్రభుత్వ విప్ రాంచందర్‌నాయక్, మహబూబ్‌నగర్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, మెదక్ మంత్రి గడ్డం వివేక్ , మేడ్చల్ ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ములుగు మంత్రి సీతక్క, నాగర్‌కర్నూల్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి , నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , నారాయణపేట్ మంత్రి వాకిటి శ్రీహరి, నిర్మల్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, నిజామాబాద్ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, పెద్దపల్లి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబెదుల్లా కొత్వాల్ , రాజన్న సిరిసిల్ల్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రంగారెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సంగారెడ్డి మంత్రి దామోదర రాజనరసింహ, సిద్దిపేట మంత్రి పొన్నం ప్రభాకర్, సూర్యాపేట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వికారాబాద్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, వనపరి ప్రభుత్వ చీప్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిలను నియమించారు.
ఎస్సెస్సీ, ఇంటర్ టాపర్లకు సత్కారం
హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి, ఇంటర్ టాపర్లకు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సత్కరించనున్నారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున బహుమతిని అందజేయనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పదో తరగతి నుంచి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు, ఇంటర్ నుంచి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను ఎంపిక చేసి వారికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పాఠశాలల్లో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలని, విద్యార్థులకు స్నాక్స్, రవాణా సదుపాయం కల్పించాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు రూ.36.30 లక్షలు నిధులను కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.