14-08-2025 01:23:58 AM
నాగర్ కర్నూల్ ఆగస్టు 13 ( విజయక్రాంతి )ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయిన స్కూల్ బస్సు బోల్తా పడిన ఘటన నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన ఆల్ సైన్స్ మోడల్ స్కూల్ కి చెందిన స్కూల్ బస్ వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్, రాయిపాకుల వంటి గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కించుకొని గన్యాగుల మీదుగా పెద్ద కొత్తపల్లి వెళ్తుండగా గన్యాగుల గ్రామ శివారులోని పాత పాడుబడిన బావి వద్ద మూలమలుపున ఫల్టీ కొట్టింది.
ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి పక్కనే ఉన్న వరి నారు మడిలోకి దూసుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న సుమారు 18 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ వైపు బోల్తాపడడంతో విద్యార్థులను డోర్ నుండి బయటికి తీసి గ్రామంలోని ఆటో సాయంతో తరలించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఫల్టీ కొట్టిన బస్సు వరి నారుమడిలో పడడంతో అపాయం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని మండల ఎంఈఓ కు ఆదేశించారు. అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు.