01-07-2025 10:16:16 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): సిగాచి కెమికల్ కంపెనీ(Sigachi Chemical Industry)లో జరిగిన పేలుళ్లలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన వారిని కఠినంగా శిక్షించాలని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఐ.కృష్ణ, హాలావత్ లింగ్యా నాయక్, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు పర్వత కోటేష్ డిమాండ్ చేశారు. పాశమైలారంలో జరిగిన దుర్ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు.
ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్వాహకులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని, ప్రతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ సంఘటన పట్ల నిరసన తెలుపుతూ ఆ పార్టీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎండి జబ్బర్, లక్ష్మయ్య, సురేష్, జయశంకర్, వేణుగోపాల్, వెంకటేశ్వర్లు, శ్రీను పాల్గొన్నారు.