calender_icon.png 31 October, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

31-10-2025 02:01:47 AM

హెడ్ మాస్టర్లను, వార్డెన్లను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, అక్టోబర్ 30, (విజయ క్రాంతి): మొంథా తుపాన్ ప్రభావం వలన రాష్ట్రంలో అధిక వర్షాలు కురుస్తున్నందున గిరిజన గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటిడిఏ పిఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. చెరువులు, కుంటలు కాలువలు పొంగి గ్రామాలలో వరద నీరు ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని ఆయా పాఠశాలల హెచ్‌ఎం వార్డెన్లు పిల్లలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తుఫాన్ ప్రభావం వలన జిల్లాలోనీ మారుమూల గిరిజన గ్రామాలలో అత్యధికంగా వర్షాలు కురుస్తున్నందున గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల పరిరక్షణ చాలా జాగ్రత్తగా చూడాలని, ప్రతి ఇన్స్టిట్యూషన్లలో పాడుబడ్డ భవనాలు ఉంటే పిల్లలు అక్కడికి వెళ్లకుండా చూడాలని, వర్షం కురిసే సమయంలో కరెంటు స్తంభాలు,కరెంటు వైర్లకు దూరంగా ఉండేలా చూడాలన్నారు.

పాఠశాల పరిసరాలు, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలని, రాత్రిపూట పిల్లలు బయటకు రాకుండా చూడాలని, పిల్లలకు వడ్డించే ఆహారము వేడిగా ఉన్నప్పుడే అందజేయాలన్నారు. పొంగుతున్న వాగులు నీటి కుంటల వైపు పిల్లలు సరదాగా సెల్ఫీలు దిగడానికి వెళ్లి ప్రమాదాల బారిన పడవచ్చని అందుకు పిల్లలు ఎవరు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పిల్లలు వర్షంలో తడిసి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున సంబంధిత ఏఎన్‌ఎం లను అందుబాటులో ఉంచుకొని సరిపడా మందులు దగ్గర పెట్టుకునేలా చూడాలని అన్నారు.

ముఖ్యంగా మారుమూల మండలాలలోని ఆదివాసి గ్రామాలలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, హెచ్‌ఎం,వార్డెన్లు మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ స్థానికంగా ఉండి పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని, తుఫాను ప్రభావం వలన ఏమైనా ఇన్స్టిట్యూషన్లు కూలిపోయే స్థితికి వస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. పిల్లలకు కాచి చల్లార్చిన గోరువెచ్చని మంచినీరుని ప్రతిరోజు తాగేలా చూడాలని అన్నారు.