calender_icon.png 19 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి.. విభజన ఇలా..!

19-09-2025 12:00:00 AM

మొదటి పంచాయతీ చంద్రవెల్లే

బెల్లంపల్లి, సెప్టెంబర్ 1౮: 1949లో సింగరేణి సంస్థ పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోయి ప్రభుత్వ రంగ సంస్థల ఆవిర్భవించింది. ఆ రోజుల్లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ప్రాంతంలో బొగ్గు గనులను ఏర్పాటు చేసి బొగ్గు తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. అప్పటి వరకు బెల్లంపల్లి ప్రాంతం మండలంలోనే విలీనమై ఉంది. బెల్లంపల్లి ప్రాంత ప్రజలు, సింగరేణి కార్మికులు ఎలాంటి అవసరం ఉన్న మండల పరిధిలోనే తమ అవసరాలను తీర్చుకునేవారు.

కనీసం గ్రామపంచాయతీగా కూడా బెల్లంప ల్లి గుర్తింపు పొందలేదు. 1979 వరకు కూడా బెల్లంపల్లి ప్రాంత ప్రజలు స్థానిక సంస్థల్లో ఓటు హక్కును వినియోగించుకోలేదు. అప్పటికే బెల్లంపల్లికి మండల కేంద్రంగా పలు గ్రామ పంచాయతీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. 1980లో పర్యటనలో భాగంగా బెల్లంపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి టి. అంజయ్య దృష్టికి ఇక్కడి నాయకులు స్థానిక సమస్యలను విన్నవించారు.

దీనితో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య బెల్లంపల్లి ప్రాంతా న్ని ముందుగా చంద్రవెళ్ళి గ్రామపంచాయతీలో విలీనం చేయాలని అధికారికంగా ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి చొరవతో 1981లో చంద్రవెళ్ళి గ్రామపంచాయతీకి మొదటిసారి  జరిగిన ఎన్నికల్లో బెల్లంపల్లి పట్టణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1981 నుంచి 1986 వరకు బెల్లంపల్లి పట్టణం చంద్రవెళ్ళి గ్రామపంచాయతీ పరిధిలోనే కొనసాగింది.

1987లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బెల్లంపల్లి పర్యటనకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం కనీసం గ్రామపంచాయతీకి కూడా గుర్తింపు పొందలేదని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్నారు. అప్పుడే బెల్లంపల్లి ప్రాంతాన్ని రెండవ గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రకటిస్తూ అధికారులకు ఆదేశాలిచ్చారు. 

అప్పటి నుంచి బెల్లంపల్లి ప్రాంతం మండలం, మున్సిపాలిటీ ప్రాంతాలుగా విడిపోయింది. బెల్లంపల్లి మండల పరిధిలో 10 గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీ పరిధిలో 34 వార్డులు ఎన్నికలలో ప్రభావితమవుతున్నాయి. ప్రస్తుతం బెల్లంపల్లి మండల పరిధి 17 గ్రామ పంచాయతీలుగా విస్తరించింది. తాజాగా పట్టణానికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను కూడా మున్సిపాలిటీలో విలీనం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.