18-09-2025 10:53:04 PM
- ఓట్లు బీసీలవి... పదవులు రెడ్లకా?
- సీనియర్ నాయకుడు బొంగు వెంకటేశ్ గౌడ్
- కాంగ్రెస్ కు రాజీనామా... తీన్మార్ మల్లన్న పార్టీలో చేరిక
ఎల్బీనగర్: కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరగదని, బహుజనులకు స్థానం లేదని సీనియర్ నాయకుడు బొంగు వెంకటేశ్ గౌడ్ అన్నారు. ఓట్లు బీసిలవి.. పదవులు రెడ్లకా? అని ప్రశ్నిస్తూ గురువారం డీసీసీ రంగారెడ్డి జిల్లా స్పోక్ పర్సన్ పదవి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఉప్పల్ లో ఉన్న తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరుగుతుందని అప్పటి మల్కాజిగిరి ఎంపీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం అహర్నిశలు పని చేశానని చెప్పారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కీగౌడ్ గెలుపుకోసం పనిచేశానని తెలిపారు. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశించానని, కానీ, ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీసీలకు నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదని విమర్శించారు. పార్టీ పదవులతోపాటు నామినేట్ పదవుల్లో సైతం అగ్రకులాలకు పెద్దపీట వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోకపోవడంలో మధుయాష్కీ గౌడ్ పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. బీసీల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీతో బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని తెలిపారు. తెలంగాణలో మెజారిటీ ప్రజలైన బహుజనులను డెబ్బై ఏళ్లుగా అగ్రకుల నాయకులు, అగ్రకుల పార్టీలు మోసం చేశారని విమర్శించారు. తీన్మార్ మల్లన్నతోనే తెలంగాణ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం వస్తుందని నమ్మి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరానని వెంకటేశ్ గౌడ్ పేర్కొన్నారు.