20-09-2025 07:00:11 PM
-మీ ఒక్కరితో మీ కుటుంబాల తలరాత మారుతుంది
- చదవండి.. అత్యున్నత స్థాయికి ఎదగండి
- అత్యుత్తమ విద్యాసంస్థలను తీసుకువస్తున్నాం
- మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మీ భవిష్యత్తుకు మించిన లక్ష్యం తమకు లేదని.. ఉన్నత శిఖరాలకు మీరు అధిరోహించినప్పుడు నా తపనకు అర్థం లభిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ నగరంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్ లో జిల్లా ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అవార్డు గ్రహీతలకు పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తాను కృషి చేస్తున్నానని చెప్పారు. మన జిల్లా పిల్లల కోసమే ఎన్నో ఉత్తమ విద్యాసంస్థలు మహబూబ్ నగర్ జిల్లాకు తెస్తున్నామన్నారు. రానున్న పదవ తరగతి వార్షిక ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో మన మహబూబ్ నగర్ ను మొదటి స్థానంలో నిలపాలని సూచించారు.
వెల్ఫేర్ పండుకు రూ.10 లక్షలు ఇస్తా..: ఎమ్మెల్యే
ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉంటాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వారికి ఏ చిన్న ఆపద వచ్చినా వారు తట్టుకోవడం కష్టమే అన్నారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకి సైతం వారు బయట అప్పులు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలా జరగకుండా ఉండాలంటే ప్రైవేటు విద్యాసంస్థలు అన్ని కలిసి ఒక యూనియన్ గా ఏర్పడి, ఒక వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు . ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి నెలా రూ 250 చెల్లించాలని, సదరు ఉపాధ్యాయుడు పని చేసే సంస్థ కూడా అంతే మొత్తంలో డబ్బులు జమ చేయాలని సూచించారు. అలా చేస్తే తానే మొదటగా విద్యా ఫండ్ క్రింద రూ 10 లక్షలు ఆ వెల్ఫేర్ ఫండ్ కు అందజేస్తానని చెప్పారు. మన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించే ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేద్దామని సూచించారు.