ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం
- మూడు ఎకరాల్లో కంటి ఆసుపత్రి ఏర్పాటుకు కృషి
మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభంలో మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ టౌన్, ఏప్రిల్ 8 : ప్రభుత్వఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్బంగా బుధవారం అయన జిల్లా కేంద్రంలోని మాన్యంచెల్కలో కోటి 91 లక్ష రూపాయల వ్యయంతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మాన్యంచెల్క యుపిహెచ్ సికి అవసరమైన మెడికల్ సామాగ్రిని ఏర్పాటు చేయడం, అవసరమైతే ఎక్కువఎక్విప్మెంట్ సమకూరుస్తామన్నారు. చుట్టుపక్కల ప్రజలు, పెద్దవారు,గర్భిణీలకు, మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనువుగా ఉంటుందని అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు.
అన్ని రకాల పరీక్షలతో పాటు, అవసరమైతే ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి రిఫర్ చేసే విధంగా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. కార్పొరేటర్లు వివిధ రకాల జబ్బులతో బాధపడే ప్రజలను గుర్తించి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలన్నారు. ప్రతీక్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో మూడెకరాల స్థలంలో కంటి ఆసుపత్రిని నిర్మించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పట్టణ పిహెచ్ సిలో మందులు అందుబాటులో లేకుంటే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన అత్యవసర మందులు అందజేసే విధంగా అనుసంధానం చేయడం జరిగిందన్నారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందులు ఇవ్వడం జరుగుతుందని, ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మాన్యంచెల్క పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అక్షయ ఫౌండేషన్ సహకారంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు ఆహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు, ఆశ వర్కర్లు బాగా పనిచేయాలని,
పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలని .మాన్యంచెల్క చౌరస్తా సుందరీకరణతో తీర్చిదిద్దడం జరుగుతున్నదని తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ విద్యతోపాటు, పేద ప్రజలకు వైద్యం అందించేందుకు మంత్రి చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు. తదుపరి నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మాన్యంచెల్కతో పాటు చుట్టుపక్కల వార్డుల ప్రజలకు పట్టణ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. డాక్టర్లు పేద ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, ప్రధాన ఆస్పత్రిసూపరింటిండెంట్ నరసింహారావు నేత, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా టీబి నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, యు పి హెచ్ సి డాక్టర్లు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.




