9 April, 2026 | 3:09 AM

గిరిజన జీవితాల్లో వెలుగులే లక్ష్యం

09-04-2026 12:52 AM

అధికారులు మానవత్వంతో సమస్యలను పరిష్కరించాలి

ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. గిరిజన జీవితాల్లో వెలుగులు నింపా లన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పమని, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

గిరిజనులు నివసించే ప్రతి ప్రాంతానికి రోడ్డు, గూడు, విద్యుత్ సౌకర్యం, తాగు నీటి కోసం బోర్లు వంటి ప్రాథమిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టంచేశారు. బుధవారం సచివాలయంలో గిరిజన ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు, అటవీ శాఖ అధికారులు, గిరిజన ప్రాంతాల ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, అమలు దశలో ఎదురవుతున్న అడ్డంకులపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చాలంటే శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి గిరిజనుల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, కేటాయించిన నిధులు లక్ష్యానికి చేరేలా అధికారు లు కట్టుదిట్టంగా పర్యవేక్షణ చేపట్టాలని మం త్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు బాలునాయక్, రామచంద్రనాయక్, వంశీకృష్ణ, మురళినాయక్, కోవ లక్ష్మి, సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఐటీడీఏ అధికారులు, డీఎఫ్‌ఓలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.