25-01-2026 12:00:00 AM
ఈ రోజుల్లో విపరీతంగా పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్‌ను అడ్డుకోవడం పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగాలకు అసాధ్యంగా మారింది. సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు కొత్త రకం మోసాలకు తెర లేపుతున్నారు. ఈ మధ్య కా లంలో స్కామ్ కాల్స్ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మోసగాళ్లు విదేశీ సిరీస్ నంబర్ల నుంచి వాట్సాప్‌లకు వీడియో, ఆడియో కాల్స్ చేస్తున్నారు. వినియోగదారుడు పొరపాటున ఈ కాల్స్‌ను ఎత్తారో డబ్బులు పోగొట్టుకున్నట్లే. ఎందుకంటే స్కామర్లు యూజర్ల దగ్గర నుంచి డబ్బు దోచేయాలని చూస్తారు. తొలుత తమను తాము గవర్నమెంట్ ఏజెన్సీ, బ్యాంకు లేదా టెక్ కంపెనీ ఉద్యోగులుగా పరిచయం చేసుకుని చాలా నమ్మకంగా మాట్లాడతారు. కానీ వారి అసలు ఉద్దేశం డబ్బు కాజేయడమే.
భారతదేశంలో ఈ సమస్య అనవసర వాణిజ్య కమ్యూనికేషన్ల స్పాప్ కాల్ప్ రూపంలోనే కనిపిస్తున్నది. దేశంలో ప్రతి పది మంది భారతీయుల్లో ఆరుగురు కనీసం రోజుకు మూడు స్పామ్ కాల్స్ పొందుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి నియంత్రణలు ఉన్నప్పటికీ చాలామంది నిరంతర ప్రమోషనల్ లేదా మోసపూరిత కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. అయితే పరిష్కార మార్గాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. ఇలాంటి కాల్స్‌ను బ్లాక్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి ఆండ్రాయిడ్ వినియోగదారులు ఫోన్‌యాప్ సెట్టింగ్స్‌లో ‘ఫిల్టర్ స్పామ్ కాల్స్’, ‘ కాలర్ ఐడీ స్పామ్’ ఆప్షన్లను ఎప్పుడూ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఐ ఫోన్ వినియోగదారులు సెట్టింగ్స్‌లో ‘సైలెన్స్ అన్ నోన్ కాలర్స్’ అనే ఆప్షన్‌ను ఆన్‌లో పెట్టుకోవాలి.
ఇక డీఎన్‌డీ కోసం 1909కి ‘స్టార్ట్’ అని సందేశం పంపడం, 1909కి కాల్ చేయడం, లేదా ట్రాయ్ యాప్ ఉపయోగించి కూడా ఇలాంటి స్పామ్ కాల్స్‌ను అరికట్టవచ్చు. ఇక సర్వీస్ ప్రొవైడర్లు, టెలికామ్ కంపెనీలు, నియంత్రణ సంస్థలు వంటివి ఇలాంటి సమస్యలపై పని చేస్తున్నప్పటికీ, దీని బారి నుంచి బయటపడడానికి వ్యక్తిగత రక్షణే శ్రీరామరక్ష. తెలియని కాల్స్‌ను ఎత్తకపోవడం, బ్లాక్ చేయడం, నిరంతరం రిపోర్ట్ చేయడం ద్వారా స్పామ్ కాల్స్‌ను గణనీయంగా తగ్గించవచ్చు.
సురేశ్, హైదరాబాద్