19-05-2024 01:17:12 AM
హైదరాబాద్‌లో మరో ప్రీలాంచ్ మోసం
350 మందిని నమ్మించి 60 కోట్లు టోకరా
ముగ్గురు నిందితుల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో మరో ప్రీలాంచ్ మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకే ప్లాట్స్ అంటూ అందమైన ప్రకటనలతో ౩౫౦ మంది నుంచి రూ.౬౦ కోట్లు వసూలు చేసిన భారతీ లేక్ వ్యూ చివరకు పంగనామాలు పెట్టింది. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో భారతీ లేక్ వ్యూ అపార్ట్‌మెంట్స్ పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టి ప్రీ లాంచ్ ఆఫర్ పేరిట తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇస్తామంటూ ప్రచారం చేశారు. తమ సంస్థ 6.23 ఎకరాల్లో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నదని.. చదరపు అడుగు రూ. 3.200కే ఇస్తామని నమ్మబలికారు. రంగురంగుల బ్రోచర్లతో కొనుగోలుదారులను బుట్టలో వేసుకొన్నారు.
కొంపల్లిలోని వెంచర్ సైట్‌తో పాటు మాదాపూర్‌లోని కార్యాలయాల్లో కస్టమర్లతో సమావేశాలు నిర్వహించారు. వీరి మాటలు నమ్మిన సుమారు 350 మంది రూ.60 కోట్ల వరకు డబ్బులు చెల్లించారు. డబ్బులు వసూలు చేసి కూడా సదరు బిల్డర్లు నిర్మాణాలు చేపట్టకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు ఆరా తీయగా, తమకు ఫ్లాట్స్ నిర్మిస్తామని చెప్పిన 6.23 ఎకరాల స్థలాన్ని రూ.100 కోట్లకు వేరేవారికి విక్రయించారని బయటపడింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజుతో పాటు ఎండీ శివరామకృష్ణ, సీఈవో నరసింహారావును శనివారం అరెస్ట్ చేశారు.
ప్రీలాంచ్‌కు మోసపోవద్దు
ప్రీ లాంచ్ పేరుతో ఇదివరకే అనేక మోసాలు జరిగాయని, తక్కువ ధరకు ఫ్లాట్స్, స్థలాలు విక్రయిస్తామంటున్న వారిని నమ్మి ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. క్రయ, విక్రయా లకు సంబంధించిన పత్రాలను నిశితంగా పరిశీలించాలని, ముందస్తుగా ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని కోరారు.