calender_icon.png 11 November, 2025 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిపేర్లు చేసినా గ్యారెంటీ లేదు

19-05-2024 01:19:13 AM

కాళేశ్వరం బరాజ్‌లకు 2019లోనే నష్టం

తాత్కాలిక మరమ్మతులతో ప్రయోజనం కొంతే

ఎన్డీఎస్‌ఏ నివేదికపై సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

త్వరలో మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్‌ల సందర్శన: సీఎం రేవంత్

హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి, మే 18 (విజయక్రాంతి): కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బరాజ్‌లు 2019లోనే దెబ్బతిన్నట్టు తేలిందని.. వాటికి రిపేర్లు చేసినా ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) మధ్యంతర నివేదికలో తెలిపిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికపై సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, సుందిళ్ల బరాజ్‌కు బుంగలు పడటంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులపై ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలు, సిఫారసులన్నింటినీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. 2019లోనే బరాజ్‌లకు ప్రమాదం వాటిల్లినట్టు ఎన్డీఎస్‌ఏ గుర్తించిందని, ఇప్పుడు వాటికి రిపేర్లు చేసినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని చెప్పలేమని నివేదికలో ఎన్డీఎస్‌ఏ స్పష్టంగా పేర్కొన్నదని తెలిపారు. జూన్ మొదటివారంలో వర్షాకాలం ప్రారంభమవుతున్నందున ఆ లోగా తీసుకోవాల్సిన చర్యలపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

రిపేర్లు చేపట్టాలా? ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా? మరింత నష్టం జరక్కుండా ఏమేం చర్యలు చేపట్టాలనే అంశంపై ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం శనివారం క్యాబినెట్ సమావేశం జరక్కపోవడంతో మేడిగడ్డ అంశంపై చర్చించలేకపోయామని సీఎం చెప్పారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్‌లను, పంప్‌హౌజ్‌లను పరిశీలిస్తామని తెలిపారు.

మేడిగడ్డ రక్షణ పనులు ప్రారంభం

కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ రక్షణ పనులను గుత్తేదారు ఎల్ అండ్ టీ ప్రారంభించింది. కుంగిన ఏడో బ్లాక్‌లోని గేట్లను ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. 8 గేట్లలో ఒకదాన్ని ఇప్పటికే ఎత్తారు. రెండు గేట్లు మినహా మిగిలినవాటిని సాంకేతిక సమస్యలు లేకుండానే ఎత్తే అవకాశం ఉందని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యలు ఏర్పడితే మాన్యూవల్‌గా గేట్లను ఎత్తే ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. అయితే, బరాజ్ వద్ద రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పనులకు ఆటంకం ఏర్పడుతున్నది. దీంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షాలు పూర్తిస్తాయిలో ప్రారంభమయ్యే నాటికి కుంగిన బ్లాక్‌లోని మొత్తం గేట్లను ఎత్తి బరాజ్ వరద తాకిడికి గురికాకుండా చూస్తామని అధికారులు తెలిపారు.