calender_icon.png 6 July, 2025 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం

12-06-2025 08:12:46 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): భూసమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా భూసమస్యలపై అందిన దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం మోదెల గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును తహశిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... భూభారతి నూతన ఆర్.ఓ.ఆర్. చట్టంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

ఈ దరఖాస్తులను రికార్డులతో సరి చూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలోని అన్ని మండలాలలో (పైలెట్ మండలం అయిన భీమారం మినహా) కార్యచరణ ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. నూతన చట్టంలో రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం కల్పించడం జరిగిందని, రిజిస్ట్రేషన్, ముటేషన్ చేసేందుకు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి, మ్యాప్ తయారు చేయడం జరుగుతుందని, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని, వారసత్వంగా వచ్చిన భూములకు విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణ చేయడం, సంబంధిత వారసులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.

దరఖాస్తుతో పాటు రిజిస్టర్డ్ దస్తావేజులు, రెవెన్యూ రికార్డులు జతపరిచినట్లయితే త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నెహ్రూనగర్, గాంధీనగర్ లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పరిసరాలు, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థులకు చదవడం, వ్రాయడం, మాట్లాడటం నేర్పించాలని, మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించాలని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ లోపం ఉన్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సంఖ్యను పెంపొందించాలని తెలిపారు. పిల్లలకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏక రూప దుస్తుల పంపిణీపై వివరాలు తెలుసుకున్నారు.

మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని మార్చురీ గది నిర్మాణ పనులు సందర్శించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల బాలికల వసతిగృహాన్ని సందర్శించి స్టోర్ రూమ్, వంటశాల, గదులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని, సకాలంలో మెనూ ప్రకారం పోషక ఆహారం అందించాలని, పరిశుభ్రత పాటించేలా విద్యార్థినులకు అవగాహన కల్పించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. మైనార్టీ, జిల్లా పరిషత్ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల గదులు, పరిసరాలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.