09-01-2026 12:30:46 AM
కరీంనగర్, జనవరి 8 (విజయక్రాంతి): ఈ నెల 23 నుంచి 30 వరకు నిర్వహించనున్న జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై ఆలయ చైర్మన్లు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, షామియానాకు, క్యూ లైన్లు, బారికేడ్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని, ఆహార వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల రద్దీ దృష్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ట్రాఫిక్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్ తదితర విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పేర్కొ న్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసి బారికేడ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. స్టేజి, లైటింగ్, సౌండ్, డెకరేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్లు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో సుధాకర్, అర్చకులు నాగరాజు పాల్గొన్నారు.