18-01-2026 12:47:20 AM
వన దేవతలుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచి, కోట్లాదిమంది ప్రజలకు ఇలవేల్పు దేవతలుగా కొలువబడుతున్న సమ్మక్క సారలమ్మలు వీరవనితలుగా ప్రసిద్ధిగాంచారు. 13 వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో మేడారం ప్రాంతాన్ని సమ్మక్క భర్త పగిడిద్దరాజు సామంత రాజుగా పరిపాలించే వాడని చరిత్ర. కాకతీయులకు కరువు కాటకాలతో మేడారం ప్రాంత ప్రజలు సకాలంలో పన్నులు కట్టలేకపోయారు. దీనితో మేడారం ప్రాంతంపై కాకతీయులు సైన్యంతో దండెత్తడానికి వచ్చారు. సమ్మక్క యుద్ధానికి సిద్ధమై వీరోచిత పోరా టం చేసి వందలాదిమంది కాకతీయ సైన్యాన్ని నేల కూల్చారు. ఇక ఓటమి తప్పదనుకొని భావించిన కాకతీయ సైన్యం సమ్మక్కను దొంగచాటుగా కత్తితో పొడిచారు. దీంతో గాయపడ్డ సమ్మక్క శత్రువుల చేతిలో మరణించడం ఇష్టం లేక యుద్ధభూమి నుంచి తప్పుకొని చిలకలగుట్టకు చేరుకుంది. సమ్మక్కను వెతికే క్రమంలో గిరిజనులు చిలకలగుట్టకు చేరుకున్నారు. అక్కడ వారికి గుట్ట పైన నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణ కనిపించడంతో పాటు సమ్మక్క మాటలు వినిపించాయి.
దీంతో కుంకుమ భరిణను సమ్మక్కకు ప్రతిరూపంగా భావించిన కోయ దొరలు దేవతగా కొలవడం జరుగుతోందని చరిత్ర. సమ్మక్క కోయరాజు రాయిబండాన్ని రాజు చందం బోయిరాలు దంపతులకు అడవిలో వేటకు వెళ్లగా కనిపించినట్లు మరోచరిత్ర. అడవిలో లభించిన బిడ్డకు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు సమ్మక్కగా నామకరణం చేసినట్లు చెబుతారు. అదే క్రమంలో మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క పగిడిద్దరాజుకు వివాహం జరిగినట్లు కూడా చెబుతారు. దీనికి అనుగుణంగానే చిలకలగుట్ట నుంచి అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణను తీసుకువచ్చి కళ్యాణ వేడుక నిర్వహించడంతోనే మేడారం జాతరగా అవతరించిందని చెబుతారు. సమ్మక్క తల్లి మేడారం గద్దెలకు రాకకు ఒకరోజు ముందు కన్నేపల్లి నుంచి కూతురు సారలమ్మను గద్దె పైకి తీసుకువస్తారు. కాకతీయులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ, జంపన్న వీరత్వానికి ప్రతీకలుగా నిలుస్తూ వన దేవతలుగా లక్షలాది మందికి ఇలవేల్పుగా మారి పూజింపబడుతున్నారు.