18-01-2026 12:44:20 AM
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కాలానికనుగుణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకూ వన దేవతలపై భక్తుల నమ్మిక పెరుగుతోంది. వచ్చే భక్తుల సంఖ్య కూడా వేల నుంచి కోట్లకు చేరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత 50 ఏళ్లుగా మేడారం జాతరలో భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ మేడారాన్ని ఆధునికికీకరణ చేస్తూ వచ్చాయి.
రెండేళ్ల కోమారు నిర్వహించే మేడారం జాతర అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ భక్తులకు కొత్తకొత్త వసతులను కల్పిస్తూ వచ్చాయి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మేడారం జాతర అభివృద్ధి కోసం రూ.251 కోట్లతో ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసింది. రాతి శిలలతో సాలారంతో గద్దెల ప్రాంగణం నిర్మాణంతో రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. మేడారం నలువైపులా రహదారులను విస్తరించారు. కవర్ షెడ్డు క్యూ లైన్లు, పలు కూడళ్లలో ఆదివాసి గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే కళాకృతులను ఏర్పాటు చేశారు.
నాడు అభయారణ్యంగా ఉండే మేడారం ఇప్పుడు ఆధునిక హంగులతో మహా నగరంగా మారింది. సకల సవులతులతో ఇప్పుడు మేడారం ధగధగలాడుతోంది. ఎడ్ల బండ్ల స్థానంలో కార్లు, జీపులు, బస్సులు, హెలికాప్టర్లలో భక్తులు వస్తున్నారు. ఎర్ర దుబ్బ రోడ్లకు బదులు తారు రోడ్డు, జంపన్న వాగులో బ్రిడ్జి నిర్మాణం జరిగింది. వాగు వరదలో స్నానానికి బదులు బ్యాటరీ టాప్స్ జల్లు స్నానం సౌకర్యం కల్పించారు. 50 లేదా 60 ఏళ్ల క్రితం దివిటీ వెలుగుల నుంచి నేడు విద్యుత్ కాంతులతో దేదీప్యమాణంగా మేడారం వెలుగొందుతోంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మారిన కాలానికనుగుణంగా అప్పటి.. ఇప్పటి మేడారం జాతర మార్పు(అప్‌డేట్)లపై ‘విజయక్రాంతి’ దృశ్య మాలిక.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్ (విజయక్రాంతి)