calender_icon.png 18 January, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన వైభవం!

18-01-2026 12:51:31 AM

‘తెలంగాణ గిరిజన సంస్కృతికి చిరునామాగా నిలిచిన మేడారం జాతర కేవలం ఒక మతపరమైన ఉత్సవం కాదు. ఇది గిరిజనుల చరిత్ర, త్యాగం, స్వాభిమాన పోరాటానికి నిలువెత్తు సాక్ష్యం. అరణ్య గర్భంలో పుట్టిన ఈ విశ్వాస పర్వం తరతరాలుగా కొనసాగుతూ నేడు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర చరిత్రపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.’

ఇల్లందు టౌన్, జనవరి17 (విజయక్రాంతి): మేడారం జాతర మూలాలు కాకతీయు ల కాలానికి చెందినవిగా గిరిజనుల నోటిమాట కథనాలు చెబుతున్నాయి. ఆ కాలం లో కోయ గిరిజన తెగలు అడవులలో స్వేచ్ఛాయుత జీవనం సాగించేవారు. అయి తే పాలకుల పన్నుల భారం పెరగడంతో గిరిజనుల జీవనం దుర్భరమైంది. ఈ దశలోనే సమ్మక్క అనే ధైర్యవంతమైన గిరిజన మహిళ నాయకత్వం వహించి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటానికి నాంది పలికింద ని విశ్వాసం. సమ్మక్క అసాధారణ శక్తులు కలిగిన మహిళగా గిరిజనులు విశ్వసిస్తారు.

అడవుల్లో పులి పెంచిన బాలికగా ఆమె కథ ప్రచారంలో ఉంది. తర్వాత కోయ తెగకు చెందిన పగిడిద్ద రాజును వివాహం చేసుకున్న సమ్మక్క గిరిజనుల హక్కుల కోసం పోరాటంలో ముందుండి నడిపింది. సమ్మ క్క కుమార్తె సారలమ్మ కూడా తల్లి బాటలోనే ధైర్యంగా నిలిచి పోరాటానికి తోడైం ది. కాకతీయ పాలకుల సేనలతో జరిగిన యుద్ధంలో అనేక మంది గిరిజనులు ప్రాణత్యాగం చేశారు. ఈ పోరాటంలో సమ్మక్క, సారలమ్మలు వీరమరణం పొందారని, ఆ తర్వాత వారు వనదేవతలుగా మారారని గిరిజనుల విశ్వాసం. అందుకే మేడారం జాతరలో సమ్మక్కసారలమ్మను దేవాలయాల్లో కాకుండా ప్రకృతి మధ్యే ఆరాధి స్తారు. ఇది గిరిజనుల ప్రకృతి ఆరాధనకు ప్రతీక. మేడారం జాతరలో విగ్రహాలు ఉండవు.

శాశ్వత ఆలయాలు లేవు. ఇదే ఈ జాతర ప్రత్యేకత. సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి, సారలమ్మను కుంకుడుగూడెం నుంచి మేడారం గుట్టకు తీసుకువచ్చే వనప్రవేశ ఘట్టమే జాతరలో అత్యంత పవిత్ర మైనది. పగిడిద్ద రాజు, గోవిందరాజుల వనప్రవేశంతో ఈ మహోత్సవం పరిపూర్ణతను సంతరించుకుంటుంది. జాతరలో బెల్లం కానుకకు విశేష ప్రాధాన్యం ఉంది. బంగా రం, వెండి, ధనానికి బదులుగా బెల్లం సమర్పించడం గిరిజనుల సరళ జీవన తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తులు తమ శరీర బరువుతో సమానంగా బెల్లం తూకంవేసి అమ్మ వారి కి అర్పించడం విశ్వాసానికి పరాకాష్టగా భావిస్తారు. ఈ సంప్రదాయం మేడా రం జాతరను ఇతర ఉత్సవాల నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది. జంపన్నవాగు కూ డా మేడారం చరిత్రలో కీలకపాత్ర పోషిస్తుంది.

సమ్మక్క కుమారుడు జంపన్న పేరుతో ఈ వాగుకు పేరు వచ్చినట్లు కథనాలు చెబుతున్నాయి. జంపన్నవాగులో స్నానం చేయడం పుణ్యప్రదమని, రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. కాలక్రమేణా మేడారం జాతర గిరిజన ప్రాంతాలకే పరిమితం కాకుండా సమస్త తెలంగాణ ప్రజల విశ్వాసపర్వంగా మారిం ది. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా లక్షలాది భక్తులు ఈ జాతరలో పాల్గొంటున్నారు. గిరిజనుల నోటిమాటగా తరతరా లుగా కొనసాగిన ఈ చరిత్ర నేడు ప్రపంచానికి తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటుతోంది. మేడారం జాతర గిరిజనుల త్యాగగాథను గుర్తుచేస్తూ, ప్రకృతితో మమేకమై జీవించాలని నేటి తరానికి బోధిస్తోంది. అరణ్యంలో పుట్టిన ఈ విశ్వాస పర్వం తరతరాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన చరిత్రగా కొనసాగుతోంది.

కడారి, ఇల్లందు, విజయక్రాంతి