calender_icon.png 22 May, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసైన్‌మెంట్ భూముల్లో ఇటుక బట్టీలు

12-05-2025 02:35:41 AM

  1. నోటీసులిచ్చి వదిలేసిన రెవెన్యూ అధికారులు 

ఉచిత విద్యుత్ వినియోగం

మేడ్చల్, మే 11 (విజయ క్రాంతి): మేడ్చల్ మండలంలో ఇటుక బట్టీల యజమానుల అక్రమాలు బయటపడుతున్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బట్టీలు ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఐదు చోట్ల అసైన్ మెంట్ భూముల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేశారు. అసైన్మెంట్ భూముల్లో ఏర్పాటు చేసినట్టు గుర్తించిన రెవిన్యూ అధికారులు ఆ తర్వాత చర్యలు తీసుకోకుండా వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది.

వ్యవసాయేతర పనులకు, వాణిజ్యపరంగా ప్రభుత్వ భూములను వినియోగిస్తున్నందున అసైనీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమకు తెలియక ఇటుక బట్టీలకు ఇచ్చామని, తర్వాత వ్యవసాయం చేస్తామని వివరణ ఇవ్వడంతో అంతటితో వదిలేశారు. కానీ ఇటుక బట్టీల యజమానులపై చర్యలు తీసుకోలేకపోయారు. ఆరు చోట్ల పట్టా భూముల్లో బట్టీలు ఏర్పాటు చేసినప్పటికీ నాలా కన్వర్షన్ చేయలేదు.

ఇటుక బట్టి ఏర్పాటు చేయాలంటే ముందుగా నాల కన్వర్షన్ చేసుకోవాలి. ఆ తర్వాతే వాణిజ్య విద్యుత్ పొందాలి. ఇవే కాకుండా గ్రామాలలో అనుమతి లేకుండా బట్టీలు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ఉచిత విద్యుత్ వాడుతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ విద్యుత్ అధికారులు తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. 

చర్యలు తీసుకుంటాం: సునీల్ కుమార్, ఇన్చార్జి తహసిల్దార్ 

అక్రమ ఇటుక బట్టీలపై చర్యలు తీసుకుంటాం. మండలంలో ఇప్పటికే కొన్ని ఇటుక బట్టీలు గుర్తించాము. ప్రతి గ్రామంలో ఎన్ని బట్టీలు ఉన్నాయో గుర్తించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి సూచించాం. వివరాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం.