calender_icon.png 2 September, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమైక్యత విలువలను చూపిన ఉపాధ్యాయులు

02-09-2025 12:04:01 AM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది ఐటీడీఏ ప్రాంతాలకు చెందిన ఆయా యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా  కొత్తగూడెం ఆనందఖని పాఠశాలలో సమావేశమై తమ సమైక్యతను చాటారు. ప్రస్తుత కొత్తగూడెం మండల విద్యాశాఖ అధికారి పూర్వ గిరిజన బీఈడీ కళాశాల భద్రాచలం ప్రిన్సిపాల్ గా పని చేసిన డాక్టర్ ప్రభుదయాల్ పదవి విరమణ సందర్భంగా  వీరంతా ఒకచోట చేరి ఉపాధ్యాయ వృత్తి మెలకువలను మరోసారి తమ పూర్వ గురువులైన డాక్టర్ ప్రభుదయాల్, ఉమామహేశ్వర రావు, సుధాకర్ ల నుండి మరోసారి తెలుసుకున్నారు.

గిరిజన బీఈడీ కళాశాలలో నాడు సుశిక్షితులై నేడు ఆయా ఐటీడీఏ ప్రాంతాల్లో ఉపాధ్యాయులుగా చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తున్నామన్నారు. తమ పూర్వ కుటుంబ స్థితి దయనీయంగా ఉండేదని భద్రాచలం బిఇడి కళాశాలలో నాటి సిబ్బంది ప్రభుదయాల్, ఉమామహేశ్వర రావు, సుధాకర్ తదితరుల శిక్షణతో ఉత్తమ ర్యాంకులతో ఆయా డీఎస్సీల్లో ఉత్తీర్ణత సాధించి ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకుని ఉపాధ్యాయ వృత్తిని చక్కగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ గా అన్ని విద్యా విషయాలలో తోడ్పాటును ఇచ్చినందున కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీకాకుళం, పాడేరు, రంపచోడవరం, శ్రీశైలం, ఏటూరునాగారం, ఉట్నూరు, భద్రాచలం ఐటిడిఏ ప్రాంతాలకు చెందిన గిరిజన ఉపాధ్యాయులు వందల సంఖ్యలో చేరి అప్పటి ప్రిన్సిపాల్, కొత్తగూడెం ఎంఈఓ పదవి విరమణ చేసిన సందర్భంగా వారి వారి అనుభవాలను పంచుకుంటూ ఈ స్థితిలో ఉండడానికి గిరిజన బిఇడి కళాశాలలో నాడు పొందిన శిక్షణ ప్రభావమేనని తెలుపుతూ డాక్టర్ ప్రభుదయాల్ ను స్వచ్ఛందంగా, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు తారాసింగ్, మోహన్ రావు,  నరేష్, నరసింహారావు, శంకర్, రిచ్చి, లు పర్యవేక్షించారు. కాగా ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనదనీ, భవిష్యత్తు నిర్మాణాన్ని నిర్ణయిస్తుందనీ అందుకే అంకితభావంతో, విలువలతో విధులను నిర్వర్తించాలని డాక్టర్ దయాల్ ఉద్భోదించారు. చిన్నారులు దేవతలతో సమానమంటూ వారి ఉన్నతికై కృషి చేయాలన్నారు.