08-01-2026 01:05:09 AM
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఐదురోజుల సభలో కృష్ణా జలాలు, హిల్ట్ భూములపై ప్రధానంగా చర్చ జరిగుతుంటే బీఆర్‌ఎస్ ఎందుకు తోకముడుచుకు ని పారిపోయిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. సభలో బీజేపీ సభ్యుల సంఖ్య తక్కువగానే ఉన్నా... ఉన్న ఎనిమిది మంది మా సభ్యులు రాష్ర్ట ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కార్నర్ చేసేందుకు గట్టిగా కొట్లాడారన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే త్రాసు ముక్కలు అని, ప్రజాసమస్య లపై పోరాడాల్సి వస్తే కేవలం బీజేపీ సభ్యులే ప్రజాగొంతుకగా నిలబడ్డారని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. భవిష్యత్‌లో ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా బీజేపీకే అవకాశం ఇవ్వాలని కోరారు.
బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఆయన పక్కన 65 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిన చోట 20 మంది కూడా లేరని, ఇది కాంగ్రెస్ పరిస్థితి అన్నా రు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా నడుస్తోందని, ఒకటో సిట్ అయిపోయి రెండో సిట్ వచ్చిందని భవిష్యత్‌లో మూడు, నాలుగో సిట్లు వచ్చేటట్లు ఉందని విమర్శించారు. కేసు దర్యాప్తు చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను కూడా పట్టేలా కనిపించడం లేదన్నారు. ఊరికేనే గంటల తరబడి ప్రశ్నిస్తున్నామని టీవీల కు బ్రేకింగ్‌లు ఇస్తున్నారని విమర్శించారు. సాంకేతిక ఆధారాలు లేకుండా ఎన్ని గంట లు ప్రశ్నిస్తే ఏం లాభమన్నారు. తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందన్న రేవంత్‌రెడ్డిని సీఎం అయిన తర్వాత సిట్ ఎందుకు పిలవడం లేదని, ఈ కేసులో అందరి వేళ్లు కేసీఆర్ వైపు చూపిస్తే ఆ ఒక్కడి అరెస్టు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.