calender_icon.png 15 July, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కొడంగల్’ రైతులకు అండగా బీఆర్‌ఎస్

10-08-2024 01:50:47 AM

  1. ఫార్మా కంపెనీలకు భూమి కట్టబెట్టేందుకు సర్కార్ యత్నం
  2. నిర్వాసిత రైతులకు సీఎం సోదరుడి బెదిరింపులు
  3. మాజీ మంత్రి కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): కొడంగల్ నియోజకవర్గంలోని రైతుల భూములను సీఎం రేవంత్‌రెడ్డి ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, తన సొంత నియోజకవర్గంలోనే రైతులకు అన్యాయం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బాధిత రైతులకు బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం నిర్వాసిత రైతులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వచ్చారు. కేటీఆర్‌కు తమగోడును వెళ్లబోసుకున్నారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. దుద్వాల్ మండలం హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల లో 3 మూడు వేల ఎకరాల భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. ఫార్మా కంపెనీలు నెలకొల్పిన తర్వాత ఆయా గ్రామాల్లో కాలుష్యం పెరుగుతుందన్నారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి భూములు ఇవ్వని రైతులను బెదిరించడమేంటని ప్రశ్నించారు. ఆయన అరాచకాలను అడ్డుకుంటామన్నారు. రైతులకు భూమి జీవనాధారమని, వాటిని ప్రభుత్వం గుంజుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

రైతుల పక్షాన తమ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలోనే గిరిపుత్రుల కలలు సాకారమయ్యాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్’ ద్వారా గిరిపుత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ పాలనలో మిషన్ భగీరథ ద్వారా మారుమూల గిరిజన గూడేలకూ శుద్ధజలం సరఫరా చేశామని గుర్తుచేశారు. 1.51 లక్షల మంది అడవి బిడ్డలకు పోడు పట్టాలు అందించామన్నారు. చిన్న గూడేలను పంచాయతీలు చేశామన్నారు. రాజధాని నడిబొడ్డున సగర్వంగా గిరిజనుల ఆత్మగౌరవ భవనాలు నిర్మించామన్నారు.

జీవో 46 అభ్యర్థులకు న్యాయం చేయాలి..

ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హమీల్లో జీవో నెంబర్ 46 అభ్యర్థులకు న్యాయం చేయాలనేదీ ఒక హామీ అని, ఆ హామీని నెరవేర్చాల్సిందేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నంది నగర్‌లోని కేటీఆర్ నివాసంలో శుక్రవారం జీవో నెంబర్ 46 అభ్యర్థులు ఆయన్ను కలిసి తమ సమస్యలు వివరించారు. ఎన్నికల ముందు జీవోను రద్దు చేస్తామని కాంగ్రెస్‌నేతలు నమ్మబలికారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని మరిచిపోయారని వాపోయారు. బీఆర్‌ఎస్ తమకు మద్దతునిచ్చి ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ వెంట నడుస్తుందని హామీ ఇచ్చారు.