calender_icon.png 10 August, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిలిండర్ పేలి కుప్పకూలిన భవనం

05-08-2025 01:46:47 AM

  1. శిథిలాలు తగిలి రోడ్డుపై వెళ్తున్న వ్యక్తి మృతి
  2. ఇంట్లోని ముగ్గురికి తీవ్ర గాయాలు 
  3. మేడ్చల్ పట్టణంలో ఘటన

మేడ్చల్ అర్బన్, ఆగస్టు 4: మేడ్చల్ పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సిలిండర్ పేలి ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాలు తగిలి ఒకరు మృతి చెందగా, ఇంట్లోని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కెట్‌లోని ఓ పురాతన ఇంటి ముందు భాగంలో ఉన్న మడిగెలలో లక్ష్మీ మొబైల్ షాప్, మరో దానిలో పూల దుకాణం ఉన్నాయి.

వెనుక భాగంలో ఫ్యామిలీ పోర్షన్ ఉంది. ఆ పోర్షన్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం కూలి శిథిలాలు చెల్లాచెదురుగా పడ్డాయి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తికి శిథిలాలు తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. ఇంట్లో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. అందులో ఒక వృద్ధురాలికి కాలిన గాయాలయ్యాయి. వీరిని  ఆస్పత్రికి తరలించారు. సహాయక బృందాలు అక్కడికి చేరుకుని అర్ధరాత్రి వరకు శిథిలాలు తొలగించాయి. 

పేలుడు శబ్దం విని షాపులలో ఉన్నవారు బయటకు పరిగెత్తుకొచ్చారు. పేలుడు దాటి కి పక్క భవనం కూడా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది. కాగా కవరేజీకి వెళ్లిన మీడియాపై ఎస్సు యతిష్ చంద్ర దురుసుగా ప్రవర్తించారు. ఫొటోలు తీస్తుంటే దుర్భషలాడారు.