calender_icon.png 21 August, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సులో మంటలు.. 79 మంది దుర్మరణం

21-08-2025 01:18:40 AM

- అప్ఘానిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం 

-మృతుల్లో 17 మంది చిన్నారులు

న్యూఢిల్లీ, ఆగస్టు 20: అప్ఘానిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి కాబూల్‌కు వెళ్తున్న వలసదారుల బస్సులో మంటలంటుకుని 79 మంది మృతి చెందారు. మృతుల్లో 17 మంది చిన్నారులు కూడా ఉన్నారు.

ఈ దుర్ఘటన ఘటనకు సంబంధించి అక్కడి మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవలే బహిష్కరణకు గురైన అఫ్ఘానిస్థానీలు ఇరాన్ నుంచి కాబూల్ వైపు బస్సులో వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో సరిహద్దు దాటగానే వెస్ట్ హెరత్ ప్రావిన్స్ వద్ద ట్రక్, బైక్, బస్సు ఢీకొన్నాయి. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

అయినా ప్రమాదంలో 79 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 17 మంది చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జాబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించాలని అక్కడి రవాణా శాఖ అధికారులను అడిగారు.

అదేవిధంగా దీనికి ఎవరు బాధ్యులో చెప్పాలన్నారు. మరోవైపు, ఇటువంటి ఘటనలు అఫ్ఘానిస్తాన్ లో తరచుగా జరుగుతున్నాయని, ఇందుకు కారణం పలువురు డ్రైవర్లు నిబంధనలను బేఖాతరు చేయడం వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు.