calender_icon.png 27 August, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహిర్భూమి కేంద్రాల్లా బస్టాండ్లు!

27-08-2025 01:41:15 AM

-బహిర్భూమి ప్రదేశాలను తలపిస్తున్న ప్రయాణికుల బస్టాండ్‌లు 

-పట్టించుకోని అధికారులు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు 

-కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్‌లల్లో నెలకొన్న పరిస్థితి ఇది 

బాన్సువాడ, ఆగస్ట్ 26 (విజయ క్రాంతి), జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆర్టీసీ బస్టాండ్ లు... బహిర్భూమి ప్రదేశాల ను తలపిస్తున్నాయనీ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూరు, పిట్లం, నిజాంసాగర్, బిచ్కుంద తో పాటు పలు మండల కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా ఉన్నాయి.

బస్టాండ్లను అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు రికార్డుల్లో చూపుతున్న వాటి దుర్గతిని మాత్రం చూడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అద్వానంగా ఉన్న బస్టాండ్లతో నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ల పరిస్థితి చూస్తే భయానా కరంగా ఉంది. మండల కేంద్రాల్లో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండాలని ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 40 సంవత్సరాల క్రితం, మరికొన్ని మండలాల్లో 20 సంవత్సరాల క్రితం  మండలానికి ఒక బస్టాండును నిర్మించింది.

ప్రయాణికుల సౌలభ్యం కోసం బస్టాండ్ నిర్మాణం చేపట్టిన అధికారులు వాటి పర్యవేక్షణ లేక బహిర్భూమి కేంద్రాలుగా మారాయి. కొన్ని బస్టాండ్లలో వాహనాలు వెళ్లడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాల జోరు కొనసాగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో మహిళలు బస్టాండ్లకు వచ్చి బస్సులు ఎక్కుతున్నారు. కనీసం కూర్చునేందుకు కూడా కుర్చీలు లేవు. నీటి సమస్య తీవ్రంగా ఉంది.

మరుగుదొడ్లు అద్వానంగా ఉన్నాయి. రాత్రి అయిందంటే విద్యుత్ లైట్లు లేక చిమ్మ చీకటిలో బస్టాండ్లు నెలకొన్ని ఉన్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లాలో అధ్వానంగా ఉన్న బస్టాండ్ ల తీరుపై విజయ క్రాంతి ప్రతినిధి బృందం పరిశీలన జరపగా ఎన్నో అవస్థలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. మరికొన్ని బస్టాండ్ ప్రాంతాలు ఆక్రమణలకు గురవుతున్నట్లు ఆరోపణలు  వినిపిస్తున్నాయి. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్టాండ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం 

బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలోని బస్టాండ్లలో సమస్యలపై విజయ క్రాంతి వివరణ కోరగా ఉన్నతాధికారులకు సమస్యలను నివేదించి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ సరితా దేవి తెలిపారు. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలగకుండా సాధ్యమైనంతవరకు ప్రయత్నిస్తామని తెలిపారు.

 సరితా దేవి, డిపో మేనేజర్, బాన్సువాడ, కామారెడ్డి జిల్లా