17-11-2025 12:00:00 AM
ప్రజలకు తప్పని తీవ్ర ఇబ్బందులు
కొత్తకోట నవంబర్ 16 : కొత్తకోట బస్టాండ్లో బస్సులను అస్తవ్యస్తంగా, ఎలాంటి నియంత్రణ లేకుండా నిలిపివేస్తుండటంతో ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్సులు నిర్దిష్ట స్థలాల్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వారం ఒక వృద్ధుడి కాలిపై బస్సు వెళ్లిన ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడటంతో స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న కొంతమంది బస్ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం బస్ స్టాండ్లో పర్యవేక్షణ పెంచి, బస్సుల నిల్వ పద్ధతిని క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.