03-07-2025 07:30:06 PM
భద్రాచలం- వెంకటాపురం ప్రధాన రహదారిపై సిపిఐ ఎం ఆధ్వర్యంలో రాస్తారోకో...
వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): బస్సులు సరిగా నడవక ఉద్యోగస్తులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఎదిర వరకు బస్సు సౌకర్యం కల్పించాలని భద్రాచలం- వెంకటాపురం ప్రధాన రహదారిపై కంకల వాగు వద్ద సిపిఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎం మండల కార్యదర్శి గ్యానం వాసు(CPI M Mandal Secretary Gyanam Vasu) మాట్లాడుతూ.. ఏదిర వద్ద రాళ్ళవాగుపై నిర్మించిన వంతెన గడ్డర్ కుంగిపోయి నెలలు గడుస్తున్న వంతెన పనులు పూర్తి చేయకపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్రిడ్జి నిర్మాణం మరమత్తులు చేపట్టకుండా బ్రిడ్జి పక్క నుండి అధికారులు తాత్కాలిక రహదారి ఏర్పాటు చేశారని, ఆ రహదారి చిన్నపాటి వర్షానికి భద్రాద్రి జిల్లా చర్ల మండలం నుంచి వస్తున్న ఇసుక లారీల కారణంగా బురదమయం అవుతుంది అన్నారు.
దాంతో భద్రాచలం డిపో నుంచి వెంకటాపురం, వాజేడు మండలాలకు నడుస్తున్న ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేస్తున్నారన్నారు. దాని కారణంగా ఎదిర నుంచి వాజేడు జూనియర్ కాలేజీకి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదేవిధంగా వెంకటాపురం మండలం నుంచి ఎదిర వరకు ప్రతిరోజు గిరిజన గ్రామాల్లో విధులకు వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న ఎస్సై తిరుపతి రావు వారికి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. డిపో మేనేజర్ తో ఫోన్లో మాట్లాడిన ఎస్సై వరంగల్ డిపో నుంచి వెంకటాపురం వస్తున్న బస్సులు నైన ఎదిర వరకు పొడిగిం చేల చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ కు వివరించారు. స్పందించిన డిపో మేనేజర్ రెండు రోజుల్లో బస్సులను నడిపేలా చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కట్ల నరసింహాచారి, చిట్టెం ఆదినారాయణ, కోకిల మాణిక్యం, బంటు పోషాలు , బోగట సాంబి డర్రా ఆనంద్ మేస్త్రి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.