04-07-2025 12:31:09 AM
బెజ్జంకి, జూలై 3: ప్రయాణికుల సౌకర్యార్థం లక్షలాది రూపాయలు వెచ్చించి బెజ్జంకి మండల కేంద్రంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ అలంకార ప్రాయంగా దర్శనమిస్తోంది. ప్రయాణ ప్రాంగణంలోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు లేక ఆర్టీసీ బస్టాండ్ వెలవెల బోతుంది. దీంతో బస్టాండ్ ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉంది.
ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో బెజ్జంకి లో సుమారు 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వున్నప్పుడు ఆర్టీసీ బస్టాండ్ నిర్మించి ప్రారంభించారు. రెండేళ్ల కిందట బస్టాండ్ కు కలర్స్ వేయించి ప్రయాణ ప్రాంగణం అని పేరు రాయటం మరిచి పోయారు. కానీ బస్టాండ్ నిర్వహణలో సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు బస్టాండ్ ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ఇతర కార్యకలాపాలకు వినియోగం
బస్టాండ్ వినియోగంలో లేకపోవడంతో పంచాయితీ లకు అడ్డాగా మారింది. అంతేకాకుండా కొందరు వాహనాలకు పార్కింగ్ గా, తహసిల్దార్ ఆఫీసుకు వచ్చినవారు కూర్చోవడానికి వినియోగిస్తున్నారు. బస్టాండ్ లోకి బస్సులు రాక పోవడంతో ప్రయాణికులతో పాటు కళాశాలలకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సు కోసం స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద రోడ్డు పైనే ఎండా, వానలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ, అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని బస్టాండ్ ను వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
ఎదురు చూపులు తప్పటం లేదు
బెజ్జంకి మండలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వున్నప్పుడు ప్రతి 20 నిమిషాల కు ఒక బస్ సౌకర్యం ఉండేదని. తమ గ్రామాన్ని .సిద్దిపేట జిల్లా లో కలిసినప్పటి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్ళటానికి బస్ ల కోసం ఎదురు చూపులు తప్పటం లేదని పలువు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు బుస్ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బెజ్జంకి ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు కరీంనగర్ టు బెజ్జంకి వయ ఇల్లంతకుంట బస్సు ప్రతినిత్యం నడుస్తుండేది, ప్రస్తుతం ఆ బస్సు రాక బెజ్జంకి నుండి ఇల్లంతాకుంట వెళ్లే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలో వెళ్లాలంటే రూ.50 ఖర్చు అవుతుంది.
హుస్నాబాద్ నుంచి బెజ్జంకి, బెజ్జంకి వేములవాడ బస్ లు ప్రస్తుతం రద్దు అయినవి, అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్ లు నడిచేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఈ విషయంపై సిద్దిపేట ఆర్టీసీ డిఎం ను వివరణ కోరెందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన స్పందించలేదు.