18-01-2026 12:54:31 AM
హైదరాబాద్ బయట తొలిసారి క్యాబినెట్ సమావేశం
నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి రాక
రేపు మేడారం మాస్టర్ ప్లాన్ ప్రారంభం
మేడారం, జనవరి 17 (విజయక్రాంతి): ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. మరో కొత్త ఆవిష్కరణకు వేదిక కానుంది. కాకతీయుల కాలంలో సామంత రాజ్యంగా విలసిల్లిన ‘మేడారం’ మళ్లీ ఒక్క రోజు రాష్ట్ర ‘రాజధాని’గా నిలవనుంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం మేడారంలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మంత్రివర్గ సభ్యులు, అధికార యంత్రాంగం మొత్తం ఆదివారం రాత్రి మేడారంలో బస చేయనున్నారు. దీనితో మేడారం ‘ఆదివారం’ ఒక్కరోజు రాష్ట్ర రాజధానిగా నిలవనుంది.
ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మేడారం హరిత టూరిజం హోటల్‌లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో కీలకమైన కొన్ని అంశాలను మంత్రివర్గం చర్చించడానికి నిర్ణయించడంతో ఈసారి మేడారం చారిత్రక నిర్ణయానికి వేదికగా నిలవనుంది. రాష్ట్ర మంత్రివర్గం, అధికార వర్గాలు మొత్తం మేడారంలోనే బసచేసి, ఆదివారం మంత్రివర్గ సమావేశం అనంతరం, సోమవారం ఉదయం మాస్టర్ ప్లాన్ ప్రకారం 101 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన మేడారం గద్దెల ప్రాంగణం, 150 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
భారీ బందోబస్తు
రాష్ట్ర మంత్రివర్గంతో పాటు చీఫ్ సెక్రటరీ, అన్ని శాఖలకు సంబంధించిన కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, 300 మందికి పైగా ఉన్నతస్థాయి అధికారులు శనివారం రాత్రి మేడారంలో బస చేస్తుండడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,500 మంది పోలీసులతో ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఆధ్వర్యంలో ఐదుగురు ఎస్పీ స్థాయి, మరో నలుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
హరిత హోటల్‌లో ప్రత్యేక బసకు ఏర్పాట్లు
రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ఉన్నతాధికారులు 300 పైగా మేడారంలోనే ఆదివారం రాత్రి బస చేయనున్నారు. ఇందుకోసం మేడారంలోని హరిత టూరిజం హోటల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. హోటల్‌లో ఉన్న 30 గదులతో పాటు తాత్కాలికంగా అన్ని హంగులతో కూడిన 40 గదులతో ప్రత్యేకంగా టెంట్ సిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఇతర ప్రైవేటు వసతి గృహాలను కూడా వినియోగిస్తున్నారు. లక్నవరం, గోవిందరావుపేట, పసర, రామప్ప, తాడ్వాయి తదితర చోట్ల కూడా అధికారులకు బస ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమాన్ని, ఏర్పాట్లను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.