calender_icon.png 18 January, 2026 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొదటి మొక్కు గట్టమ్మకే!

18-01-2026 12:55:50 AM

మేడారం మహా జాతరకు తరలి వచ్చే లక్షలాదిమంది భక్తులు ముందుగా ములుగు జిల్లా జాకారం వద్ద కొలువైన గట్టమ్మ దేవాలయంలో అమ్మవారికి మొదటి మొక్కు సమర్పిస్తారు. ఆదివాసి నాయకపోడు ఇలవేల్పుగా విలసిల్లుతున్న గట్టమ్మ తల్లికి ఘన చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో సైన్యం తో జరిగిన పోరాటంలో గట్టమ్మ కూడా ప్రాణాలు అర్పించినట్లు చరిత్రకారులు చెబుతారు. గట్టమ్మ తల్లి కుటుంబంలో మొత్తం ఏడుగురు ఆడపడుచులు ఉన్నారని, వీరిలో గట్టమ్మ అందరికంటే పెద్ద అని, జాతరకు వచ్చే భక్తులకు ఘట్టమ్మ తల్లి రక్షణగా ఉంటుందని నమ్మిక. ఆ ప్రకారం మేడారం వచ్చే భక్తు లు ముందుగా గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించి మేడారం బయలుదేరడం ఆనవాయితీగా వస్తోంది.

మేడారం మహా జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు ముందుగా గట్టమ్మ దేవాల యం దగ్గర తప్పనిసరిగా ఆగి తల్లికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి, జాతరకు సురక్షితంగా వెళ్లి రావడానికి రక్షణగా ఉండాలంటూ వేడుకుంటారు. మేడారం జాతర సమయంలో ఘట్టమ్మ దేవాలయం వద్ద భక్తుల రద్దీ నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుంది. ప్రత్యేక పార్కింగ్‌తో పాటు జాతీయ రహదారిని విస్తరించారు. ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించారు. జాతర సమయంలో ఇక్కడ ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తారు. 

 సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి