02-05-2025 01:41:08 AM
కామారెడ్డి, మే 1 (విజయక్రాంతి): స్టేట్ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం లెక్చరల్ అసోసియే షన్ పిలుపు మేరకు గత పది రోజులుగా రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో నిరవధిక సమ్మెను చేస్తున్న పి.టి.ఎల్ (పార్ట్ టైం లెక్చరర్) అధ్యాపకుల సమ్మెలో బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆరట్స్ కళాశాలలో చేపట్టిన మహా ధర్నా విజయవంతమై ప్రభుత్వం దృష్టికి పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పలువురు ప్రజా ప్రతినిధుల, నాయకుల నుండి వెళ్ళగా ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి ద్వారా ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది.
ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిచ్పల్లి, భిక్కనూర్, సారంగాపూర్ క్యాంపస్ లోని పార్ట్ టైం అధ్యాపకులు నిరవధిక సమ్మెలో పాల్గొనగా, తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యదగిరిరావు పార్ట్ టైం అధ్యాపకుల సమ్మె టెంట్ వద్దకు వచ్చి ప్రభుత్వం మీ సమస్యలపై సానుకూలంగా స్పందించిందనీ, త్వరలోనే మీ సమ స్యలు పరిష్కారం అవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తమకు తెలిపారని అన్నారు. పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను పరిష్కరించడంలో నేనెప్పుడూ ముందుంటానని వీసీ తెలిపారు. కావున మీరు సమ్మెను విరమించి విధులలో చేరాలని వారిని కోరారు. ఈ సందర్భంగా తె.యూ పార్ట్ టైం అధ్యాపకులు మాట్లాడుతూ, గత పది రోజులుగా నిరవధిక సమ్మెకు సహకరించిన అన్ని యూనివర్సిటీల పార్ట్ టైం అధ్యాపకులకు, అందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొన్నారు.