18-10-2025 01:51:49 AM
ధర్పల్లి పోలీస్ స్టేషన్ లో 1998 లో కేసు నమోదు
మొత్తం 77 మంది నక్సలైట్స్‌పై క్రిమినల్ కేసు
నిజామాబాద్ అక్టోబర్ 17 (విజయక్రాంతి): పూర్వ సీపీఐ (ఎమ్‌ఎల్) పీపుల్స్ వార్ గ్రూప్ మాజీ మిలిటెంట్స్ బండ శీను, బొర్రన్నలపై 27 సంవత్సరాల క్రితం నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్త్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్వ భారత కమ్యూనిస్ట్ పార్టీ (ఎమ్‌ఎల్ ) పీపుల్స్ వార్ గ్రూప్ సిర్నాపల్లి దళం ఆధ్వర్యంలో ఉత్తర తెలంగాణ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన 100 మంది మావోయిస్ట్‌లకు సిర్నాపల్లి అటవీ ప్రాంతంలో డిశంబర్ 03,1998 న శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ప్రత్యేక పోలీసు భద్రతా బలగాలు చేరుకున్నాయి.
దీంతో మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. కాగా ఎదురు కాల్పుల ఘటనకు సంబంధించి నాటి ధర్పల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ మురళీధర్ పిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ నివేదికను రూపొందించారు. పూర్తి నేర విచారణ జరిపిన అనంతరం నాటి నిజామాబాద్ డివిజినల్ పోలీసు అధికారి ఎదురు కాల్పుల ఘటనలో లభించిన వస్తువులు తదితర వాటితో పాటు ఫోరెన్సిక్ నివేదిక లను జత చేసి ప్రధాన ముద్దాయిగా గౌరారం తండా లంబాని రామ్ చందర్ ను పేర్కొంటూ మొత్తం 77 మంది మావోయిస్టులపై అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేశారు. పలుమార్లు నేర న్యాయ విచారణ నిర్వహించిన కోర్టు వారిపై నేరారోపణలు రుజువు కానందున కేసులను కొట్టివేశాయి.
చివరిగా ధర్పల్లి మండలం లింగపూర్ గ్రామానికి చెందిన బండ శీను, బొర్రన్న లపై కోర్టు బెయిలకు వీలులేని అరెస్ట్ వారంట్ ను 26 ఆగస్టు, 2016 న జారీ చేయడంతో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. వారికి నెల తరువాత కోర్టు బెయిలు మంజూరు చేసింది.ఈ కేసులో ముద్దాయిల అందరి తరపున మొదటి నుండి ప్రముఖ న్యాయవాది ఆశ నారాయణ వాదించారు.ఈ కేసు విషయమై ముద్దాయిల తరపు న్యాయవాది తెలిపిన వివరాలిలా ఉన్నాయి.నేర న్యాయ విచారణలో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసిన కోర్టు, ఇతర ధ్రువ పత్రాలు మార్క్ చేసి ముద్దాయిలపై నేర ఆరోపణలు రుజువు కానందున బండ శీను, బొర్రన్న లను నిర్దోషులుగా ప్రకటిస్తు, వారిపై నమోదైన కేసును కొట్టివేస్తు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ తీర్పు చెప్పారు.